అందాల భామ దీపికా పదుకొనె రాణీ పద్మిణీ పాత్రలో నటించిన సినిమా 'పద్మావత్' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏ సినిమాకైనా విడుదలకు ముందు ప్రమోషన్ కార్యక్రమాలతో హోరెత్తిస్తుంటారు. కానీ ఈ సినిమా విషయంలో రివర్స్‌లో జరిగింది. ఎటు చూసినా వివాదాలే తప్ప, అసలు సినిమాకి పబ్లిసిటీ చేసే అవకాశమే లేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. అలాంటిది ప్రమోషన్స్ విషయంలో ఈ సినిమా బాగా వెనుకబడిపోయింది.
అయితేనేం విడుదలయ్యాకా ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు రాణి పద్మిని పాత్రలో నటించినందుకు దీపికా ముక్కు కోసేస్తామనీ, తల నరికేస్తామనీ కొందరు ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే ప్రస్థావిస్తూ దీపికా, సినిమాలో ఏముందో తెలీకుండా ఆందోళనలు చేసిన వారిని ఊరికే వదలకూడదనీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చిన్నప్పుడు తన లైఫ్‌లో జరిగిన విషయాన్ని ఉదాహరణగా చెప్పింది. ఈ సంగతి పక్కన పెడితే, సినిమాలో రాణి పద్మిని పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందనీ, నేటి తరం అమ్మాయిలు ఈ పాత్రని ఆదర్శంగా తీసుకొని, చాలా నేర్చుకోవాల్సి ఉంటుందనీ చెప్పింది.
చురకత్తుల్లాంటి చూపులతో, చేతులే ఆయుధంగా, కత్తులు లేకుండానే ప్రత్యర్థులతో యుద్ధం చేయగల సత్తా ఉన్న వీర వనిత రాణి పద్మిని. అలాంటి పాత్రలో నటించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాననీ దీపిక చెప్పుకొచ్చింది. ఇన్నాళ్ల తన సినీ కెరీర్‌లో ఎన్నో వేరియేషన్స్ ఉన్న, బరువైన పాత్రల్లో నటించిన తనకు పద్మిని పాత్రలో నటించడం చాలా కష్టమైందనీ దీపిక చెప్పుకొచ్చింది. ఇంతటి ధీరవనిత కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలను ఆపాలని రాజ్‌పుత్ మహిళలే ఆందోళనలకు దిగడం బాధాకరమైన విషయం అని ఆమె పేర్కొంది.