దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'పద్మావతి'. ఈ సినిమాలోని ఓ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ధగ ధగా మెరిసే ఆభరణాలతో, పొడవాటి లెహెంగాలో దీపిక అలా నృత్యం చేస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదంతే. సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పాటలోని డాన్స్‌కి అత్యంత ప్రత్యేకతలున్నాయి. రాజ్‌పుత్ వంశానికి చెందిన రాణులు ఈ నృత్యాన్ని చేస్తారు. ఆ డాన్సు నేర్చుకోవడానికి దీపిక సినిమా స్టార్ట్ అవ్వక ముందే కసరత్తులు చేసిందట. ఈ నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుందట. అందుకే ఇంతందంగా కుదిరింది. అయితే ఇలాంటి నృత్యాలు దీపికకు కొత్తేమీ కాదు. గతంలోనూ పలు చిత్రాల్లో నర్తించింది. కానీ ఈ పాటలో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. రాజ్‌పుత్ వంశంలో సాంప్రదాయ నృత్యం ఘూమర్. 'ఘూమర్.. ' అంటూ సాగే ఈ పాట కోసం 100 మంది 40 రోజులు కష్టపడి సెట్ వేశారట. గుండ్రంగా తిరుగుతూ చేసే నృత్యమిది. ఇందుకోసం దీపికా 60 సార్లకు పైగా గుండ్రంగా తిరిగుతూ నాట్యం చేసిందట. ఆమె గుండ్రంగా తిరుగుతున్నప్పుడు అందంగా తిరుగుతున్న, ఆమె ధరించిన లెహెంగా వెయిట్ ఎంతో తెలుసా? అక్షరాలా 20 కిలోలు. 20 కిలోల వెయిట్ ఉన్న లెహెంగాతో, మోయలేని బరువున్న ఆభరణాలతో దీపికా ఘూమర్ నృత్యం చేయడానికి ఎక్కువే కష్టపడింది మరి. అన్నట్లు సినిమా చిత్రీకరణే ఈ పాటతో మొదలైంది తెలుసా! అంత స్పెషల్ ఈ సాంగ్ సినిమాకి. ఈ సినిమాలో దీపికాతో పాటు షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.