చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే రికార్డుల మోత మోగించేస్తోంది. ఇక 151వ చిత్రం లైన్‌లోకి వచ్చేసింది. ఈ సినిమాకి కూడా చరణే నిర్మాత. అలాగే డైరెక్టర్ వచ్చి 'ధృవ' సినిమాలో చరణ్‌ని ఎంతో స్టైలిష్ లుక్‌లో చూపించిన సురేందర్ రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తెలిపారు. 60 ఏళ్ల మెగాస్టార్ వయసును 20ల్లోకి తగ్గించేసినట్లుగా చూపించిన 'ఖైదీ' డైరెక్టర్ వినాయక్‌ని మించి స్టైలిష్ లుక్‌లో చూపించేయడానికి సురేందర్ రెడ్డి తయారైపోతున్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాడట నిర్మాత రామ్ చరణ్. అంతేకాదు మంచి టెక్నికల్ వేల్యూస్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోందట. ఈ సినిమాలో కన్నా స్టైలిష్‌గా చిరంజీవిని చూపించే ప్రయత్నంలో ఉన్నాడు సురేందర్ రెడ్డి. మరోపక్క చిరంజీవితో ఇంకా పూరి జగన్నాధ్ వంటి డైరెక్టర్లు కూడా సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. గతంలోనే పూరీ ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఈ సారి ఛాన్స్ మిస్ చేసుకోనంటున్నాడు. అంతేకాదు చిరు నోట పూరీ మాట కూడా వచ్చింది. పూరీ తెచ్చిన కథలో కొన్ని మార్పులు చేసి తీసుకొస్తే ఆయనతో కూడా సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు మెగాస్టార్. నిర్మాతగా తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న చరణ్ బ్యాక్ టు బ్యాక్ మళ్లీ మెగాస్టార్ సినిమానే తెరకెక్కించాలని అనుకోవడం విశేషం.