వెన్నెలతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు దేవాకట్టా. అదో సెన్సిబుల్ స్టోరీ. కట్ చేస్తే... ప్రస్థానంతో తన ఎమోషనల్ డెప్త్ మొత్తం చూపించాడు. అప్పట్నుంచీ... తను ఆ తరహా సినిమాలనే ఎంచుకుంటున్నాడు. తన నుంచి పూర్తి స్థాయి ప్రేమకథ రాలేదు. అయితే.. మరోసారి `వెన్నెల`లాంటి సెన్సిబుల్ లవ్ స్టోరీ తీస్తానని చెబుతున్నాడు దేవాకట్టా.
''వెన్నెల అంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే ఆ సినిమాని నేను సరిగా డీల్ చేయలేదు. ఇంకా బాగా చెప్పాల్సింది. దిల్ చహతాహై.. జిందగీ నా మిలేగీ దుబారా లాంటి కథలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కథలు నా దగ్గర నాలుగు ఉన్నాయి. వాటిలోఒక కథని త్వరలోనే తెరకెక్కిస్తా. వెన్నెలలానే ఇదో ఫ్రెష్ థాట్'' అన్నాడు దేవా. ఇటీవల దేవా కట్టా నుంచి రిపబ్లిక్ వచ్చింది. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా తగిన ఫలితం అందుకోలేదు. అయితే జీ 5లో మాత్రం ఈ చిత్రానికి మంచి స్పందనే వస్తోంది. ''ఈ సినిమాని థియేటర్లలో సరిగా చూడలేదు. అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. కానీ... ఓటీటీలో మాత్రం చాలా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా చాలామందిలో స్ఫూర్తి నింపుతోంది. మేం కోరుకున్నదీ అదే. బాక్సాఫీసు లెక్కలు వేసుకోకుండా చేసిన సినిమా అది. చివరికి మేం అనుకున్న ఫలితం వచ్చినట్టైంది'' అని చెప్పుకొచ్చాడు.