తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన సినిమా 'పవర్ పాండీ' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ సినిమా గురించిన చర్చలే జరుగుతున్నాయి. ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట ధనుష్. ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నటన కంటే దర్శకత్వం కష్టమని చెబుతూ, దర్శకుడిగా ఓ సినిమా తీయడానికి ముందు 17 షార్ట్ ఫిలింస్‌కి దర్శకత్వం వహించినట్లు వివరించాడు. ఈ అనుభవం తనకి సినిమా డైరెక్ట్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే ఓ హిందీ సినిమాలో కూడా నటించిన ధనుష్, త్వరలోనే హాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. మే 14 నుంచి ఆ హాలీవుడ్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. అత్యంత పాపులర్ అయిన ఓ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగానూ, సంతోషంగానూ ఉందంటున్నాడు ధనుష్. ఇంకో వైపు ధనుష్, రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందించబోతున్నాడట. 'పవర్ పాండి' సినిమాతో దర్శకుడిగా సత్తా చాటాడు గనుక, మావయ్య రజనీకాంత్ హీరోగా ధనుష్ రూపొందించే సినిమాపై అంచనాలు అలా ఇలా ఉండవ్ మరి.