సృజనాత్మక రంగం... సినిమా. ఇది ఒకరి చేతుల్లో నడిచే విషయం కాదు. 24 విభాగాలూ కష్టపడాలి. అందుకోసం వందల మంది శ్రమించాలి. క్రియేటీవ్ డిఫరెన్సెన్స్ అనేవి ప్రతీచోటా ఉండేవే. సినిమాల్లో ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సినిమాల్లో దర్శకుడికీ కెమెరామెన్‌కీ క్లాష్ వస్తుంటుంది. కొన్ని చోట్ల నిర్మాతలకూ, దర్శకుడికీ, ఇంకొన్ని చోట్ల హీరోకీ, నిర్మాతకీ ఏవో చిన్న చిన్న గొడవలు. ఇవన్నీ కామనే. అయితే `సార్` సినిమాకి మాత్రం ఇవన్నీ కలిసొచ్చేశాయని టాక్.
ధనుష్ నటిస్తున్న తెలుగు చిత్రం `సార్`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే ఇప్పుడు సడన్ గా ఆగిపోయింది. దానికి అనేక కారణాలు. ధనుష్‌కి కరోనా సోకింది. ఆయన షూటింగ్‌కి వచ్చే పరిస్థితి లేదు. ఆయనకే కాదు.. `సార్` టీమ్ లో చాలామందికి కరోనా సోకింది. దాంతో పాటుగా.. టీమ్ లో విబేధాలు మొదలయ్యాయట. `సార్` కెమెరామెన్ దినేష్ కృష్ణన్‌కీ దర్శకుడికీ పడడం లేదట. ఆయన తొలి షెడ్యూల్ ముగిసిన వెంటనే `రాం... రాం` చెప్పేసి బయటకు వచ్చేశాడట. వెంకీ అట్లూరికీ, సూర్య దేవర నాగవంశీకీ కూడా టర్మ్స్ బాగాలేవని టాక్. పారితోషికం విషయంలో ధనుష్ కూడా సంతృప్తిగా లేడని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే....`సార్` సవ్యంగా సాగుతుందా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.