ఈనెల 25న భీమ్లా నాయక్ రాబోతోంది. నిజానికి ఈ డేట్ పై ఎవరికీ నమ్మకాలు లేవు. భీమ్లా నాయక్ ఈనెలలో రావడం దాదాపు అసాధ్యం అని, ఏప్రిల్ కి షిఫ్ట్ అవుతుందని అంతా డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే నిన్నా మొన్నటి వరకూ భీమ్లా పాట తీస్తూనేఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. దానికితోడు ప్రమోషన్లు కూడా మొదలెట్టలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏపీలో టికెట్ రేట్ల గొడవ ఇంకా తేలలేదు. అందుకే.. భీమ్లా వస్తాడని ఎవరూ అనుకోలేదు. అయితే.. ఉన్నట్టుండి ఫిబ్రవరి 25నే వస్తున్నాం.. అని ప్రకటించేశారు. దాంతో ఫ్యాన్స్ హ్యాపీ. ఈ రిలీజ్ డేట్ వెనుక.. దిల్ రాజు ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.
భీమ్లా నాయక్ సినిమా నైజాం రైట్స్ ని దిల్ రాజు కొన్నారు. ఆయన భారీ రేటుతో.. ఈసినిమా హక్కుల్ని కైవసం చేసుకున్నారు. ఈనెలలో భీమ్లా రాకపోతే.. ఆయనపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే... వేసవిలో చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాల నైజాం రైట్స్ దాదాపుగా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. అవన్నీ క్లాష్ అవుతాయన్నది దిల్ రాజు భయం. అన్నింటికంటే ముఖ్యంగా ఫిబ్రవరి 25 అనేది.. ఎఫ్ 3 కోసం ఫిక్స్ చేసుకున్న డేట్. సంక్రాంతిలో తమ సినిమాని వాయిదా వేసుకున్నందుకు ఆ డేట్.. భీమ్లాకి ఇచ్చాడు దిల్ రాజు. అందుకే... ఈ డేట్ లో మీ సినిమా రిలీజ్ చేయాల్సిందే అని దిల్ రాజు పట్టుపట్టాడని తెలుస్తోంది. ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉండడంతో.. భీమ్లా నిర్మాత కూడా.. రంగంలోకి దిగిపోయాడట.