ఏ విషయాన్నయినా కమర్షియల్ గా ఆలోచించడం దిల్ రాజుకి అలవాటు. రిస్క్ తీసుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. సేఫ్ గేమ్ ఆడుతూ.... లాభాలు సంపాదించడం ఆయనకు బాగా తెలుసు. అందుకే దిల్ రాజు కెరీర్ లో విజయాల శాతం ఎక్కువ. అయితే... తొలిసారి ఆయన ఓ భారీ రిస్క్ చేస్తున్నారు.
దిల్ రాజు నిర్మించిన చిత్రం ఎఫ్3. ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమైంది. ఎఫ్ 2 సూపర్ డూపర్ హిట్టవ్వడంతో ఎఫ్ 3పై అంచనాలు పెరిగాయి. పైగా వేసవి సీజన్‌లో విడుదల అవుతున్న సినిమా కాబట్టి, భారీ వసూళ్లు దక్కడం ఖాయం. అయితే... మరుసటి రోజే.. `ఆచార్య` రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది. అది తప్పకుండా ఎఫ్ 3పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆచార్యని చూసైనా.. ఎఫ్ 3 రిలీజ్ డేట్ మారుతుందని అంతా అనుకున్నారు. కానీ దిల్ రాజు మాత్రం మొండి పట్టు వదల్లేదు. తన సినిమాని అనుకున్న సమయానికే విడుదల చేస్తానని ప్రకటించారు. తన సినిమాని ఎప్పుడూ సోలోగా విడుదల చేసుకోవాలనుకునే దిల్ రాజు, ఎఫ్ 3 విషయంలో మాత్రం చిరుకి పోటీగా వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే ఈ పోటీ వెనుక ఓ రహస్యం ఉంది. అదేంటంటే.. నైజాంలో నిన్నా మొన్నటి వరకూ దిల్ రాజుకి తిరుగులేదు. అయితే... వరంగల్ శ్రీను నుంచి ఈమధ్య గట్టి పోటీ ఎదురవుతోంది. ఆచార్య నైజాం రైట్స్ వరంగల్ శ్రీను చేతికి దక్కాయి. తనని కాదని... శ్రీనుకి ఆచార్య రైట్స్ ఇవ్వడం దిల్ రాజుకి నచ్చలేదని, అందుకే ఆచార్యపై పోటీగా తన సినిమాని విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. నైజాంలో దిల్ రాజు చేతిలో ఎక్కువ థియేటర్లున్నాయి. కాబట్టి.. ఈ విషయంలో ఆచార్యకు గట్టి షాక్ తగిలే ప్రమాదం వుంది.