Dil Raju: అతిపెద్ద రిస్క్ లో పడిపోయిన దిల్ రాజు

మరిన్ని వార్తలు

దిల్ రాజు చాలా తెలివైన నిర్మాత. ఆయన ప్లాన్ అఫ్ యాక్షన్ చాలా పక్కగా వుంటుంది. విజయ్ తో తీసిన వారసుడు సినిమాని కూడా పక్కగా ప్లాన్ చేసుకున్నారు. అందరి కంటే ముందు సినిమా విడుదల తేది జనవరి 12 అని ప్రకటించారు. అప్పటికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాల విడుదల తేదిలు ఇంకా రాలేదు. నిజానికి బాలకృష్ణ వీరసింహా సంక్రాంతికి వూహించారు కానీ వాల్తేరు వీరయ్యని దిల్ రాజు ఊహించలేదు. ఎందుకంటే గాడ్ ఫాదర్ వచ్చి సరిగ్గా మూడు నెలలు కూడా కాలేదు. ఈలోగ మరో సినిమాని, అదే బ్యానర్ లో సినిమాని ఒకేసారి ఎందుకు విడుదల చేస్తారని ఒక లెక్క వేసుకున్నారు దిల్ రాజు. అయితే ఆయన లెక్క తప్పింది.

 

వీరయ్య సంక్రాంతి వచ్చేయల్సిందే అని పట్టుపట్టారు చిరంజీవి. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ మరో ఆప్షన్ లేక రెండు సినిమాలు విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. అయితే దిల్ రాజు వెనక్కి తగ్గలేదు. 'ఇప్పుడు సినిమా అంతా పాన్ ఇండియా. డబ్బింగ్ అనే ప్రసక్తి లేదు' అంటూ గట్టిగా నిలబడ్డారు. థియేటర్స్ బ్లాక్ చేసుకున్నారు. వీరసింహా, వీరయ్య కంటే ఎక్కువ థియేటర్లు వారసుడికి కనిపించాయి. దిల్ రాజు బలగం స్పష్టంగా కనిపించింది. అయితే ఇక్కడ జనాల నుండి నెగిటివ్ రియాక్షన్ మొదలైయింది. ఒక తమిళ హీరో.. తన సినిమా గురించి కనీసం తెలుగు ప్రేక్షకులని పలకరించడానికి రాని ఓ హీరో .. అలాంటి హీరో సినిమాకి మన హీరోల కంటే ఎక్కువ థియేటర్లా ? ఇదెక్కడి న్యాయం ? అనే చర్చమొదలైయింది. ఇక ఇండస్ట్రీ నుండి ఒత్తిడి పెరిగింది. ఈ వ్యవహారం ఈ ఒక్క సినిమాతో పోయేది కాదు. ఇద్దరు స్టార్ హీరోలు, వాళ్ళ ఫ్యాన్స్.. అందరి మనోభావాలని ద్రుష్టిలో పెట్టుకుంటే మంచిదని సూచనలు సలహాలు వచ్చాయి. దిల్ రాజు కి పరిస్థితి అర్ధమైయింది. ముందు తెలుగు హీరోల సినిమాలు తర్వాతే నా సినిమా అంటూ 14కి జరిపారు.

 

అయితే దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా రిస్క్ తో కూడుకున్నది. వారసుడు సినిమా ట్రైలర్ కి తెలుగు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఫ్యామిలీ సినిమాలన్నీ మిక్స్ లో వేసితీసినట్లువుందని కామెంట్లు వినిపించాయి. ముందు వారిసు 11న రిలీజ్ అవుతుంది. అక్కడ టాక్ తేడా కొడితే ఇక్కడ వారసుడు నిండామునిగిపోతుంది. ఓపెనింగ్స్ రావడం కూడా కష్టం. సంక్రాంతి సినిమాల పండగ కూడా. ఎన్ని సినిమాలైన ప్రేక్షకులు చూస్తారని చెబుతుంటారు. ఇది రివాజుగా చెప్పే మాటే. ప్రాక్టికల్ గా ఇది జరగని పని. అందరికీ మూడు సినిమాలు చూసే స్థితి వుండదు. రెండు సినిమాలు చూసినప్పటికే.. 'ఇంకో సినిమా ఎందుకులేరా బాబు' అనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో వచ్చేస్తుంది.

 

దిల్ రాజు కాంతార ని ఉదాహరణగా చెప్పారు. కన్నడ లో విడుదలైన నెల తర్వాత కూడా తెలుగులో బాగా ఆడింది వారసుడు అంతే అన్నారు. కాంతారకి వారసుడికి చాలా తేడా వుంది. కాంతార ఒక కొత్త ప్రపంచాన్ని చూపింది. కానీ వారసుడులో అన్ని తెలుగు సినిమాలు కనిపిస్తున్నాయి. తెలుగు మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకునే వారసుడుని భారీ స్థాయిలో నిర్మించారు దిల్ రాజు. తన చేతిలో వున్న థియేటర్స్ అన్ని లాక్ చేసి ఓపెనింగ్స్ తో గట్టెక్కేయాలనేది ఆయన ముందు ఆలోచన. ఇప్పుడు స్ట్రాటజీ కుదరలేదు. ఇప్పుడా రిలీజ్ తేదినే రిస్క్. వీరసింహా, వీరయ్యలు యావరేజ్ గా వున్నా.. జనాలు అటు వైపే చూస్తారు. ఇప్పుడు చేతిలో వున్న ఒకే ఒక ప్రచార ఆయుధం.. వారసుడు ఫ్యామిలీ సినిమా అని చెప్పడం.. ఫ్యామిలీ సినిమాలు బాగున్నా అంత త్వరగా ఎక్కవు. శతమానం భవతి ఇరవై రోజుల తర్వాత రన్ అందుకుంది. అయితే ఇప్పుడంతా సమయం లేదు. ఏరకంగా చూసిన దిల్ రాజు తన కెరీర్ లోనే అతి పెద్ద రిస్క్ లో పడిపోయారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS