విలక్షణ నటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం భారతీయుడు. దాదాపు 20 ఏళ్ళ క్రితం విడుదలయిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. నేషనల్ అవార్డు తో పాటు పలు అవార్డులు అందుకుంది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించేందుకు ఇప్పుడు రంగం సిద్ధమైంది.
శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో 'భారతీయుడు 2' చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో నిర్మించేందుకు ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు తన అఫీషియల్ పేస్ బుక్ ద్వారా వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించే ఈ చిత్రం కోసం కమల్ హాసన్ - శంకర్ లతో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.
దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. భారతీయుడు సీక్వెల్ లో కూడా అవినీతిని అంతం చేసే విధంగా కథ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం శంకర్ రోబో 2.0 చిత్రంతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశం వుంది.