పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` గా విజృంభిస్తున్నాడు. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా కలక్షన్ల మోత మోగిస్తోంది. అంతలోనే.... ఓ న్యూస్ బయటకు వచ్చేసింది. ఈ సినిమా అతి త్వరలో ఓటీటీలో విడుదల అవుతుందన్నది ఆ వార్త సారాంశం. రూ.30 కోట్లు పెట్టి, అమేజాన్ ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. ఈనెల 23న వకీల్ సాబ్ ఓటీటీలో పెట్టేస్తుందని ప్రచారం జరిగింది.
అదే నిజమైతే.. వకీల్ సాబ్ కి పెద్ద దెబ్బ పడిపోదును. ఇప్పుడిప్పుడే కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమా చూడ్డానికి సిద్ధం అవుతున్నారు. 23న వస్తుందనుకుంటే, ఓటీటీలో చూద్దాంలే అనుకుంటారు. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రారు. అందుకే... దిల్ రాజు స్పందించారు. ఈ సినిమాని ఓటీటీలో ఇప్పట్లో విడుదల చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. నిజానికి వకీల్ సాబ్ విడుదలైన 15 రోజుల్లో ఈసినిమాని ఓటీటీలో ప్రదర్శించుకునేందుకు దిల్ రాజు ఒప్పందంపై సంతకం చేశారు. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ హోరు చూసి.. అమేజాన్ తో సంప్రదింపులు జరిపి, ఆ డేట్ ని వాయిదా వేశారు. వకీల్ సాబ్ మేలో అమేజాన్లోకి వస్తుందని సమాచారం.