సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' ఈ నెల 26న బయటకు రాబోతోంది. అదెలా ఉండబోతోంది? అంటే, ఇప్పుడే చెప్పలేం. టీజర్ లేదా ట్రైలర్‌తో ఓ అంచనాకి వచ్చేయడానికి కుదరదు. వర్మ ఏదో కొత్త ప్రయత్నమైతే చేశాడు. అది పోర్న్ సినిమా అనేయడం తొందరపాటే అవుతుంది. పోర్న్ సినిమా అయినా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఏముంటుంది?
పోర్న్ సినిమాలు ఇప్పుడు మొబైల్ ఫోన్లలోకి వచ్చేశాయి. ఇంటర్నెట్ విప్లవం ఫలితమిది. ఇంట్లో కంప్యూటర్‌లో 'పోర్న్ సినిమాలు' వెతుక్కుని, డౌన్‌లోడ్ చేసుకునే రోజులెప్పుడో పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ సీజన్ నడుస్తోంది. హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా, స్మార్ట్ మొబైల్ పోన్లలో లభ్యమవుతోంది. చట్ట సభల్లోనే ప్రజా ప్రతినిథులు కూడా ఈ పోర్న్ వీడియోస్‌ని డౌన్‌లోడింగ్ చేసుకుని చూస్తోన్న ఘటనలు అప్పుడప్పుడూ వెలుగు చూస్తున్నాయి. వాటిని నిషేధించలేని అచేతనావస్థ మన ప్రభుత్వాలది.
వ్యవస్థలోని లోపాల్ని ప్రశ్నించడం వర్మకి కొత్త కాదు. కాబట్టి తాను తీసేది పోర్న్ సినిమానే అయినా దాన్ని సమర్థించుకోగల శక్తి ఆయనకుంది. ఇక్కడ వర్మ డేరింగ్‌ని మెచ్చుకుని తీరాల్సిందే. సామాజిక బాధ్యత అనే మాట వర్మ విషయంలో మాట్లాడకపోతేనే మంచిది. ఎందుకంటే ఆయనెప్పుడూ సామాజిక బాధ్యత గురించి మాట్లాడడు, పైగా అది తనకి నచ్చని విషయమంటాడు.
తన క్రియేటివ్ మైండ్‌కి ఫలానా విషయం క్రియేటివ్‌గా అనిపిస్తే, అటువైపు వెళ్ళడం వర్మకి అలవాటు. వర్మని అలా ఉండనిస్తేనే, అతని నుంచి ఇంకా అద్భుతాలు రావొచ్చు. ఇంటర్నెట్‌లో పోర్న్‌ని పూర్తిగా నిషేధించగలిగితే అప్పుడు వర్మ మీద విమర్శలు చేయొచ్చుగానీ, ఆ పోర్న్ కంటెంట్‌ని ఎంజాయ్ చేసేవారు, దేశంలోకి రానిస్తున్న ప్రజా ప్రతినిథులు వర్మని ప్రశ్నిస్తే ఎలా?