'బాహుబలి ది కంక్లూజన్' అందరి అంచనాల్ని పటాపంచలు చేస్తూ వెయ్యి కోట్ల మార్క్‌ని చేరుకుంది. బాలీవుడ్ ట్రేడ్ పండితుల్నే షాక్‌కి గురిచేసిన ఫిగర్ ఇది. 'బాహుబలి ది కంక్లూజన్'కి కుప్పలు తెప్పలుగా ప్రశంసలు వచ్చిపడితే, ఒకట్రెండు విమర్శలు కూడా వచ్చాయి కొందరి నుంచి. అలా విమర్శలు చేసినవాళ్ళ నోళ్ళు కూడా వెయ్యి కోట్ల వసూళ్ళతో 'బాహుబలి' మూయించేసింది. ఇప్పుడు 'బాహుబలి' వెయ్యి కోట్లు మాత్రమే కాదు, అంతకు మించి. వెయ్యి కోట్ల వసూళ్ళ సాధన తర్వాత కూడా 'బాహుబలి' జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ సోమవారం కూడా వసూళ్ళ ప్రభంజనం తప్పకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే 1200 కోట్ల పై చిలుకు మార్క్‌ని 'బాహుబలి' అందుకోవచ్చునేమో. అంటే లాంగ్ రన్‌లో 'బాహుబలి' 1500 కోట్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు. 'దంగల్' సినిమా లేటెస్ట్‌గా చైనాలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. వంద కోట్ల పై చిలుకు అక్కడ సాధిస్తుందని అంచనా. 'దంగల్' తర్వాత 'బాహుబలి' కూడా అక్కడికి వెళుతుంది. 'బాహుబలి ది బిగినింగ్' చైనాలో నిరాశపరిచినా 'బాహుబలి ది కంక్లూజన్' అంచనాల్ని అందుకుంటుందని భావించవచ్చు. ఏదేమైనప్పటికి 'బాహుబలి ది కంక్లూజన్' ఓ సినిమా మాత్రమే కాదు, ఇదొక చరిత్ర. ఆ చరిత్రను రాసిన దర్శకుడు రాజమౌళికి ముందుగా శుభాకాంక్షలతోపాటు, కృతజ్ఞతలు కూడా తెలపాలి.