హీరోయిన్ భావనపై కిడ్నాప్, లైంగిక వేధింపుల విషయమై ఆమె పోలీసులనాశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ హీరో ఆమెపై పగబట్టాడు. అందుకే ఆమెపై ఈ దాడి జరిగింది. అనే గాసిప్స్ విన వస్తున్నాయి. హీరోయిన్ భావనపై లైంగిక వేధింపుల ఘటన తర్వాత ఈ తరహా గాసిప్స్ వెలుగు చూడటం దారుణం. ఈ ఘటనపై మలయాళ సినీ పరిశ్రమ భావనకు అండగా నిలిచింది. తమిళ, తెలుగు సినీ పరిశ్రమ కూడా ఆమెకు సానుభూతి తెలిపింది. ఇలాంటి ఘటనల్లో దోషుల్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే సంచలనాల కోసం లైంగిక వేధింపులపై గాసిప్స్ ప్రచారంలోకి రావడం మాత్రం శోచనీయం. ఓ కేసులో నటిపై అత్యాచారం జరిగిందనీ, దానికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని గాసిప్స్ రావడంతో ఆ నటి అప్పట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. ఇటువంటి గాసిప్స్‌ని ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా బాధితులకు మరింత క్షోభ కలుగుతుంది. దోషుల్ని శిక్షించడంలో ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉందో, సంయమనం పాటించే విషయంలో మీడియాకీ అంతే సామాజిక బాధ్యత ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి, మీడియా వ్యవహరిస్తే బావుంటుందని సినీ రంగంలో చాలా మంది భావిస్తున్నారు. ఏది ఏమైనా సినీ నటి భావనపై జరిగిన ఈ దాడిని ఖండించాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది.