ఇంకా యంగ్ హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్సులేంటి? డాన్సులేంటి? బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ని చూసి, చిరంజీవి కూడా వయసుకు తగ్గ పాత్రలు చేయవచ్చు కదా? అని చాలా ఉచిత సలహాలు చాలా మంది నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే ఎలాంటి పాత్రలు చేయాలనే విషయంలో చిరంజీవికంటూ ఓ 'కన్విక్షన్' ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి కొత్త నటుడు కాదు. మెగాస్టార్‌గా రెండు దశాబ్దాలపాటు తెలుగు తెరపై సత్తా చాటారాయన. బాక్సాఫీస్ వసూళ్ళకు కొత్త అర్థం చెప్పిన వ్యక్తి చిరంజీవి. తొమ్మిదేళ్ళ విరామం తర్వాత వస్తూనే 100 కోట్ల వసూళ్ళ మార్క్‌ని ఛేదించిన మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి సినిమా చేయాలో తెలియకుండా ఉండదు. 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' సినిమాని ఎంచుకోవడంలోనే చిరంజీవి ఆలోచనా విధానం ఏమిటో అర్థమవుతుంది. అయితే అశేషంగా ఉన్న అభిమానుల్ని అలరించడం కూడా చాలా చాలా పెద్ద బాధ్యతే. అది చిరంజీవికి తెలుసు. లేదంటే, 'ఖైదీ నెంబర్ 150' సినిమా కోసం చిరంజీవి అంతలా డాన్సులేసెయ్యాల్సిన అవసరమేమీ లేదు. చేశారంటే, అది కేవలం అభిమానుల కోసమే. తెలుగు సినీ పరిశ్రమ ఆలోచనలు మారాయి. ఇప్పుడంతా బిన్నమైన చిత్రాల గురించి ఆలోచన చేస్తున్నారు. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు ప్రయోగాల బాట పడుతున్నారు. ఆ బాటలో చిరంజీవి కూడా తనదైన ప్రత్యేకతను చాటుకోడానికి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమాని ఎంచుకున్నారు. ఏ పాత్రలు చేయాలో, ఎలాంటివి చేస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారో, ఏ సినిమాలు అభిమానుల్ని అలరిస్తాయో చిరంజీవికి కాక ఇంకెరికి తెలుసు?