ఎంతటి గొప్ప దర్శకులైనాసరే, కెరీర్‌లో పరాజయాలు చూసి ఉండొచ్చు. అలాగని వారి ప్రతిభను తక్కువ చేయలేం. కానీ కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా పరాజయం ఎరుగకపోవడమంటే చాలా చాలా చాలా గొప్ప విషయంగా పరిగణించాలి. ఆ ఘనత దక్కించుకున్నాడు మన దర్శక ధీరుడు, జక్కన్న రాజమౌళి. ఎందరో మహానుభావులు, వారెవర్నీ తక్కువ చేయలేం. అయినప్పటికీ కూడా రాజమౌళి ఘనత అసామాన్యం. ఆయనకు సాటి ఇంకెవరూ రారేమో. తెలుగు సినిమా బిజినెస్ లెక్కల్ని మార్చేశాడాయన. 50 కోట్లతో ఓ స్టార్ హీరోతో సినిమా తీస్తే, అది గట్టెక్కుతుందా? లేదా? అనే భయం ఇప్పటికీ ఉంది. రాజమౌళికి మాత్రం అలాంటి భయాలేమీ లేవు. ధైర్యంగా ముందడుగు వేశాడు. 50 కోట్లు ఏం ఖర్మ? 100 కోట్లు అంతకు మించి పెట్టుబడి పెట్టినా, లాభాలు ఆర్జించే సినిమా తీయగలనని నిరూపించాడు. తెలుగు సినిమా అంటే ఇకపై 100 కోట్ల లోపు సినిమా ఏమాత్రం కాదు. అంతకు మించిన సత్తా తెలుగు సినిమాకి ఉంది. వెయ్యి కోట్ల ఖర్చుతో రాజమౌళి ముందు ముందు ఓ సినిమా నిర్మిస్తే, అది 1500 కోట్లు సాధించినా ఆశ్చర్యం ఏమీ ఉండదు. అంతకు మించి కూడా సాధించవచ్చు. 'బాహుబలి ది కంక్లూజన్' సినిమా విడుదల తర్వాత రాజమౌళిని, బాహుబలి రాజమౌళి అని దేశమంతా కొనియాడుతోంది. మేటి దర్శకులు కూడా సాహో రాజమౌళి అంటున్నారు.