'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళిపై అంచనాలు చాలా చాలా ఎక్కువ అయిపోయాయ్. బాలీవుడ్ ప్రముఖులు కూడా, తమకు అందుబాటులో ఉన్న మేటి దర్శకుల కన్నా రాజమౌళిపైనే ఎక్కువగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రతిష్టాత్మక చిత్రం అనే మాట రాగానే ముందుగా రాజమౌళి పేరు ఆలపిస్తున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. షారుఖ్‌ఖాన్‌కి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే 'మహాభారతం'. దాన్ని తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇంకో వైపున మరో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌కీ, ఇంకో సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కి కూడా 'మహాభారతం'పై ఆశలున్నాయి. షారుక్‌ఖాన్ అయితే ఓపెన్‌గా చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో 'మహాభారతం' తీయాల్సి ఉంటుందనీ, దానికోసం ఇంకో నిర్మాత తనతో కలిసి రావాలని అన్నాడాయన. 'బాహుబలి'లా 'మహాభారతం' సినిమా తెరకెక్కాల్సి ఉందనీ, అంతకు మించిన రీచ్ ఆ సినిమాకి ఉంటుందని అన్నాడు బాలీవుడ్ బాద్‌షా. అంటే రాజమౌళి మాత్రమే 'మహాభారతం'ను తెరకెక్కించగలడనే కదా అర్థం. రాజమౌళి కూడా 'మహాభారతం'ను తెరకెక్కించాలనుకుంటున్నాడు. అయితే అది అంత చిన్న విషయం కాదు. ఒకటి, రెండు, మూడు పార్ట్‌లు కూడా సరిపోకపోవచ్చు. అంత లాంగ్ స్పాన్ ఉన్న కథ అది. అంత గొప్పది కాబట్టే రాజమౌళి తప్ప ఇంకెవరూ డీల్ చేయలేరనే అభిప్రాయానికి బాలీవుడ్ ప్రముఖులూ వచ్చినట్లు తెలియవస్తోంది.