ఓ సినిమాలో నటించేటప్పుడు కో స్టార్స్ మధ్య ఒక బాండింగ్ ఏర్పడటం సహజం. అంత మాత్రాన నటించిన ప్రతి ఒక్కరితో ఎఫైర్ అంటగట్టడం కరక్ట్ కాదు. కొందరి హీరోల లైఫ్ లో వారి ప్రమేయం లేకుండా కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. వారిలో ప్రభాస్ ఒకడు. మొదటి నుంచి ప్రభాస్ ఏ హీరోయిన్ తో నటించినా ఆ హీరోయిన్ తో ఎఫైర్ అని ప్రచారం జరుగుతుంటుంది. గతంలో త్రిష, కాజల్ అగర్వాల్, అనుష్క లతో ఇలానే పుకార్లు వ్యాపించాయి. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్న ప్రభాస్ కెరియర్ కి బాలీవుడ్ మీడియా శాపంగా తయారయ్యింది. సాహో సినిమా టైంలో శ్రద్దా కపూర్ తో, ఆదిపురుష్ టైంలో కృతిసనన్ తో ఇలాంటి ప్రచారాలు హద్దులు మీరి చేశారు.
సినిమా జనాల్లోకి వెళ్తుంది అన్న భ్రమతో ప్రభాస్ లైఫ్ కి మచ్చ అంటించింది. ప్రభాస్ ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. అన్ స్టాప్ బుల్ షోలో డార్లింగ్ ని బాలయ్య కూడా ఇదే విషయం అడిగారు. తరువాత ఇవన్నీ నిజం కాదని ఫేక్ అని తెలిసి తూచ్ అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అలాంటిదే జరుగుతోంది. కల్కి సినిమాలో దీపికా, దిశా పఠానిలు నటించారు. దీపికకి పెళ్లి అయిపోవటంతో బతికిపోయాడు ప్రభాస్. కానీ దిశాతో డార్లింగ్ కి అఫైర్ అని వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ప్రచారం మొదలు పెట్టింది బాలీవుడ్ మీడియా.
ఈ వార్తలకి బలం చేకూరుస్తూ రీసెంట్ గా దిశా పఠాని చేతిపై "PD" అనే అక్షరాలతో ఉన్న టాటూ దర్శనమిచ్చింది. ఆ టాటూను చూసిన నెటిజన్స్ PD అంటే ప్రభాస్ డార్లింగ్ అని నానార్ధాలు వెతుకుతున్నారు. దిశా ప్రభాస్ పై విపరీతమైన ప్రేమ పెంచుకుంది అని, అందుకే ఇలా టాటూ వేసుకుందని నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కల్కిలో వీరి జోడి బాగుందని బయట కూడా వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని డిసైడ్ చేసేస్తున్నారు. అసలు దిశా చేతి పై 'పీడీ' అనే అక్షరాల అర్థం ఏంటో ఆమె చెప్తే కానీ తెలియదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అని ప్రచారాలకి దిశా ఎప్పుడు చెక్ పెడుతుందో మరి.