ఇంత వరకూ చప్పగా సాగిన బిగ్ బాస్ 4 సీజన్‌కి కాస్త డ్రామా మిక్సయి, హుషారు పెరిగింది. సాధారణంగా.. ఎలిమినేషన్ రోజున భావోద్వేగాలే కనిపిస్తుంటాయి. కన్నీటి వీడ్కోలు, భారమైన హృదయాలతో బయటకు వెళ్లడాలే దర్శనమిస్తాయి. అయితే... ఈసారి మాత్రం అందుకు రివర్స్. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. చాలా మాటలు అనేసుకున్నారు. అరుపులు, ఏడుపులు.. కనిపించాయి. మొత్తానికి ఈ శనివారం నాటి ఎపిసోడ్ అయితే.. ఓరకంగా బాగా రక్తి కట్టిందనే అనుకోవాలి. ఈ వారం.. నోయల్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు.
కారణం.. ఎలిమినేట్ అయి కాదు. తన అనారోగ్యంతో. అంక్లియోసింగ్ స్పాండిలైటిస్ అనే సమస్యతో నోయల్ బాధ పడుతూ వచ్చాడు. ఆ సమస్య తీవ్రతరం అవ్వడంతో, బిగ్ బాస్ హౌస్ లో ఉండలేక నోయల్ బయటకు వచ్చేశాడు. అయితే బయటకు వచ్చేశాక అవినాష్, రాజశేఖర్ మాస్టర్‌లపై విరుచుకు పడ్డాడు. వాళ్లని ఒంటికాలిపై నిలబెట్టి... `ఎలా ఉంది.. నొప్పిగా ఉందా.. మీరు కాసేపే నొప్పిని భరించలేకపోయారు. నేను కొన్ని రోజులుగా ఓర్చుకుంటూ వచ్చా`` అని తన బాధని వెళ్లగక్కాడు.
"నాకు అంక్లియోసింగ్ స్పాండిలైటిస్ ఉంది. పొద్దున లేచాక అరగంట కాళ్లు స్ట్రెచ్ చేసుకుంటేనే నడవగలను. దాన్ని మీరిద్దరూ జోక్ చేస్తారేంటి?" అని నిలదీశాడు. తాను ఎలా నడిచానో చూపిస్తూ అవినాష్ ఎగతాళి చేశాడని చెప్పాడు. కానీ అతడి కాలికి దెబ్బ తగిలినప్పుడు తాను కట్టు కట్టానని పేర్కొన్నాడు. అవినాష్ ది చిల్లర కామెడీ అన్నాడు. అవినాష్ అందుకుని బయటకు వెళుతూ వెళుతూ బ్యాడ్ చేయొద్దని ప్రాధేయ పడ్డాడు. కామెడీని తక్కువ చేసి మాట్లాడొద్దని.. అరిచేశాడు. అమ్మ రాజశేఖర్ ఎప్పటిలా... కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతకాలం బిగ్ బాస్ హౌస్‌లో ఈ ముగ్గురూ బాగానే ఉన్నారు. బయటకు వచ్చాకే విబేధాలు బయటపడ్డాయి.