తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ భూతం ఉందని సినీ ప్రముఖులే ఒప్పుకున్నారు. అయితే ఆ భూతం తాలూకు ప్రభావం ఇప్పటికైతే చాలా తక్కువే కాబట్టి మొగ్గ దశలోనే దాన్ని తుంచేస్తామని ప్రతినబూనారు. ప్రభుత్వానికి సహకరించి, డ్రగ్స్ మహమ్మారి టాలీవుడ్‌లో లేకుండా చేయడంతోపాటుగా దానికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికీ మేలు చేస్తామని చెప్పారు సినీ ప్రముఖులు. 12 మంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న తర్వాత కొంత ప్రశాంత వాతావరణం సినీ పరిశ్రమలో కనిపిస్తోంది. అయితే విదేశాల నుంచి వచ్చిన ఓ పార్సిల్, ఆ పార్సిల్‌ని పరిశీలించేందుకు రామానాయుడు స్టూడియోస్‌కి 'సిట్' బృందం వెళ్ళడంత మళ్ళీ ఆందోళన మొదలైంది. ఆ పార్సిల్ ఏమీ లేదుగానీ సినీ పరిశ్రమపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టడం ఆందోళన కలగిస్తుందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రభుత్వానికి సహకరిస్తామని సినీ పరిశ్రమ చెప్పింది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకో వైపున జరిగిన విచారణ అనంతరం వాటిని విశ్లేషించడం ద్వారా మరికొందరిపై అనుమానాలు బలపడుతున్నాయనే ఊహాగానాలు సినీ పరిశ్రలో కొత్త అలజడికి కారణమవుతోంది. డ్రగ్స్ మహమ్మారికి చిక్కినవారు వేళ్ళ మీద లెక్కబెట్టే స్థాయిలోనే ఉండొచ్చు, అసలు లేకపోనూ వచ్చు. కానీ ఆ కొందరి కారణంగా ఇండస్ట్రీ ఆందోళనకు గురయ్యే పరిస్థితులు రావడం శోచనీయం.