చిత్రం: కింగ్ ఆఫ్ కొత్త
నటీనటులు: దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి
దర్శకత్వం: అభిలాష్ జోషి
నిర్మాతలు: జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్
సంగీతం: షాన్ రెహమాన్, జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: శ్యామ్ శశిధరన్
బ్యానర్స్: జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్
విడుదల తేదీ: 24 ఆగష్టు 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.25/5
తెలుగులో క్లాస్ సినిమాలతో అలరించిన హీరో దుల్కర్ సల్మాన్. మహానటి, ఓకే బంగారం, సీతారామం.. ఈ సినిమాలన్నీ దుల్కర్‌కి ఓ క్రేజ్ తీసుకొచ్చాయి. తను కూడా వైవిధ్యభరితమైన కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం సాగిస్తున్నాడు. అయితే ఏ హీరోకైనా, మాస్ సినిమా చేయాలని, యాక్షన్ హీరో అనిపించుకోవాలని ఉంటుంది. ఆ ప్రయత్నంలో తమ ఇమేజ్‌ని దాటి ఆలోచిస్తుంటారు. దుల్కర్ కూడా అలా ఆలోచించే... `కింగ్ ఆఫ్ కొత్త` కథని ఎంచుకొన్నాడు. క్యారెక్టర్ పరంగా, సెటప్ పరంగా దుల్కర్ ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశార్నన విషయం టీజర్, ట్రైలర్‌తో అర్థం అవుతోంది. మరి... ఈ ప్రయత్నం ఎంత వరకూ నెరవేరింది? దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో మాస్‌ని మెప్పించాడా, తన యాక్షన్ రక్తి కట్టిందా?
కథ: రాజు (దుల్కర్ సల్మాన్) కొత్త అనే ప్రాంతానికి కింగ్. పేదవాళ్లని ఆదుకొంటాడు. పెద్ద వాళ్లతో ఆడుకొంటాడు. డబ్బంటే ఇష్టం లేదు. కుటుంబానికి దూరంగా ఉంటాడు. స్నేహితుడు కన్నా (షబ్బీర్) అంటే ప్రాణం. రాజు గ్యాంగ్‌లో అతనే కీలకం. తారా (ఐశ్వర్య లక్ష్మి)ని ప్రేమిస్తాడు రాజు. తన కోసం.. కొత్త లో గంజాయి లేకుండా చేస్తాడు. అయితే గంజాయి స్మగ్లింగ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించొచ్చన్నది కన్నా ఫీలింగ్. కానీ ఈ విషయంలో స్నేహితుడి మాటని కూడా కాదంటాడు రాజు. దాంతో కన్నా.. రాజు ప్రత్యర్థులకు దగ్గరవుతాడు. ఈ విషయం రాజుకి తెలిసి కన్నాని దూరం పెడతాడు. అనుకోని పరిస్థితుల్లో రాజు.. ఊరొదిలి వెళ్లిపోవాల్సివస్తుంది. రాజు ఎందుకు ఊరొదిలాడు? మళ్లీ ఎప్పుడు వచ్చాడు? తాను వచ్చేసరికి కొత్త ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: దుల్కర్ సల్మాన్ గ్యాంగ్ స్టర్ సినిమా చేస్తున్నాడు, దానికి తనే నిర్మాత అనేసరికి ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. గ్యాంగ్ స్టర్ డ్రామా అనేది రెగ్యులర్ ఎమోషనే. కానీ దుల్కర్ అందులో ఏదో కొత్తదనం చూపిస్తాడన్న ఆశ కలిగింది. అయితే... ఆ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయాడు దుల్కర్. ఇదో సాదా సీదా గ్యాంగ్ స్టర్ డ్రామా. సాధారణంగా ఇలాంటి కథల్లో ఓ అనామకుడు గ్యాంగ్ స్టర్ అవ్వడం, తాను నమ్మిన వ్యక్తే మోసం చేయడం వల్ల అగాథంలో పడిపోవడం చూస్తుంటాం. ఇక్కడా అదే జరిగింది. ఇద్దరు స్నేహితుల కథతో ప్రయాణం మొదలైంది. స్నేహితుడు మోసం చేయడం వల్ల... ఆ బాధలో హీరో ఊరు వదిలి వెళ్లిపోతాడు. మళ్లీ కొంతకాలానికి తిరిగి వచ్చి, శత్రు సంహారం చేస్తాడు. స్థూలంగా ఇదే కథ.
గ్యాంగ్ స్టర్ కథలెప్పుడూ కొత్తగా ఉండకపోవొచ్చు. ఒకే ఫార్మెట్ లో సాగొచ్చు. కానీ ఆ డ్రామాని, ఎమోషన్‌నీ కొత్తగా చూపించాలి. కింగ్ ఆఫ్ కొత్తలో.. ఊరి సెటప్, అక్కడి పాత్రలు కాస్త రొటీన్ కి భిన్నంగానే కనిపించాయి. కానీ.. ఆ గ్యాంగ్ స్టర్ డ్రామా మాత్రం పూర్తిగా పాతది. తొలి 20 నిమిషాల వరకూ.. హీరో పాత్ర ఎంట్రీ ఇవ్వదు. తను వచ్చాక కూడా కథ ముందుకు వెళ్లదు. అదే పాత తరహా సన్నివేశాలతో దర్శకుడు బాగా విసిగించాడు. ఫుట్ బాల్ అనే కొత్త నేపథ్యం ఈ కథకు జోడించారు. దాని వల్ల వచ్చిన అదనపు ఆకర్షణ ఏమిటో అర్థం కాదు. ప్రెండ్‌షిప్, లవ్... ఈసినిమాలో దర్శకుడు నమ్ముకొన్న ఎమోషన్లు. వాటిని కూడా ఆసక్తికరంగా చూపించలేకోపోయాడు. కన్నాని రాజు ఎందుకు అంతలా నమ్మాడో? తారాని ఎందుకు అంత గాఢంగా ప్రేమించాడో అర్థం కాదు. ఈ ఎపిసోడ్లు రెండూ పేలవంగా సాగాయి. ఇంట్రవెల్ కి కథ కాస్త ఆసక్తి కలిగిస్తుంది. రాజు ఊరికి తిరిగిరావడం, తన సత్తా చూపించడం ఇవన్నీ బాగున్నాయి. కానీ.. తన పాత స్నేహితుడ్ని కలుసుకొన్న తరవాత కథ మళ్లీ మొదటికి వస్తుంది. ఇంత చేసినా.. స్నేహితుడ్ని ఎలా నమ్ముతున్నాడు? అనిపిస్తుంది. ఓ రకంగా క్యారెక్టర్ లో ఉన్న లోపం ఇది. పతాక సన్నివేశాలు కూడా సుదీర్ఘంగా సాగుతాయి. చాలాసార్లు సినిమా అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. కానీ.. అవ్వదు. 20 నిమిషాల ముందే సినిమా ముగించేసినా... వచ్చిన నష్టం ఏమీ ఉండదు.
నటీనటుల ప్రతిభ: దుల్కర్‌ని ఇప్పటి వరకూ లవర్ బోయ్ పాత్రల్లోనే చూశారు ప్రేక్షకులు. మధ్యమధ్యలో కాస్త కొత్త తరహా కథలు ఎంచుకొన్నా.. కింగ్ ఆఫ్ కొత్త అనేది పూర్తిగా దుల్కర్‌ని వేరే స్థాయిలో చూపించిన సినిమా. తన గెటప్, సెటప్ కొత్తగా ఉన్నాయి. మాస్ & రగ్గ్‌డ్ లుక్‌లోనూ దుల్కర్ ఆకట్టుకొంటాడని ఈసినిమాతో అర్థమవుతుంది. ఐశ్వర్య లక్ష్మి పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. ఆ పాత్రని డిజైన్ చేయడంలోనూ దర్శకుడు గందరగోళానికి గురయ్యాడు. షబ్బీర్ నటన ఆకట్టుకొంటుంది. మిగిలినవాళ్లలో ఎవరికీ గుర్తుండిపోయే పాత్రలు దక్కలేదు.
సాంకేతిక నిపుణులు: ఈ సినిమా కలర్ టోన్, ఫ్రేమ్ వర్క్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. దాంతోనే ఎంతో కొంత కొత్త ఫీలింగ్ కలిగింది. దర్శకుడు ఓల్డ్ స్కూల్ ఫార్ములా కథని ఎంచుకొన్నాడు. ఎలివేషన్లపై పెట్టిన శ్రద్ద డ్రామాపై పెట్టలేదు. ఫ్రెండ్ షిప్, లవ్, ఎమోషన్ ఇవన్నీ సరిగా పండలేదు. టెక్నికల్ గా చూస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో వింటేజ్ లుక్ వచ్చింది. కొన్ని డైలాగులు ఆకట్టుకొంటాయి. క్వాలిటీ మేకింగ్ కనిపించింది.
ప్లస్ పాయింట్స్
దుల్కర్ మాస్ అవతార్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
సాగదీత సన్నివేశాలు
ఫైనల్ వర్టిక్ట్ : కోత... సాగదీత...