హీరోయిన్స్‌లో పదహారణాల తెలుగమ్మాయిలు చాలా మందే ఉన్నారు . కానీ వారికి స్టార్డమ్ మాత్రం లేదు. అందంతో పాటు, అభినయం పండించే సత్తా కూడా ఉన్నప్పటికీ, తెలుగమ్మాయిలంటే చులకనగా చూసే భావం తెలుగు ఇండస్ట్రీలో ఉందని వాపోతోంది ముద్దుగుమ్మ ఈషా రెబ్బ. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఇటీవలే 'అమీ తుమీ' సినిమాతో హిట్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం 'దర్శకుడు' సినిమాలో నటిస్తోంది. హరిప్రసాద్ జక్కా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్నారు. అలాగే కథకి సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు కూడా అందించారు సుకుమార్. ఓ దర్శకుడి నిజ జీవితంలో జరిగిన కథకి దృశ్య రూపమే 'దర్శకుడు' సినిమా కథ. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. ఆగష్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ముద్దుగుమ్మలకు తెలుగు సినిమాల్లో సరైన ఆదరణ కరువైనందుకే తమిళ, మలయాళ చిత్రాలను ఆశ్రయిస్తున్నారు. కానీ అక్కడి వారికి ఇక్కడ అపురూపమైన ఆదరణ దక్కుతోంది. వెలికి తీస్తే మన తెలుగమ్మాయిలు కూడా అద్భుతాలు సృష్టిస్తారు. కానీ తెలుగు హీరోయిన్ల మీద ఈ చిన్న చూపెందుకు? అంటోంది ఈ ముద్దుగుమ్మ. టాలెంట్ ఉన్నా కానీ తెలుగమ్మాయిలకు ఆదరణ కరువైపోయిందనీ, ఇతర భాషల నుండి వస్తోన్న ముద్దుగుమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ స్టార్డమ్ వారికే కట్టబెడుతున్నారంటూ ముద్దుగుమ్మ ఈషా ఆవేదన చెందుతోందట. పాపం ఈషా ఆవేదన ఆర్ధం చేసుకొనేదెవ్వరు?