ఈ ఏడాది టాలీవుడ్‌లో సినీ బోణీ బెడిసికొట్టిందనే చెప్పాలి. గతేడాది స్టార్టింగ్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ కాసులతో కళకళలాడిపోయింది. రెండు పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమా కూడా వసూళ్ల విషయంలో సత్తా చాటింది. కానీ ఈ ఏడాది ఇంతవరకూ విడుదలైన పెద్ద సినిమాలూ, చిన్న సినిమాలూ కూడా భారీగా నిరాశపరిచాయి. మళ్లీ జనవరి 26 నుండి కొత్త సినిమాల సందడి మొదలు కానుంది.
జనవరి 26న విడుదలవుతున్న సినిమాల్లో పెద్ద సినిమా, భారీ బడ్జెట్ సినిమా అంటే అనుష్క నటించిన 'భాగమతి' అని చెప్పొచ్చు. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్‌గా పెద్దగా ఫేం లేకపోయినా, ఈ సినిమాని అశోక్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. 'బాహుబలి' సినిమాతో అనుష్కకున్న స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. భారీ సెట్టింగులు, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇప్పటికైతే ప్రోమోస్ పరంగా 'భాగమతి' బాగానే అంచనాలు నమోదు చేసింది.
అయితే నిన్న మొన్నటి దాకా విడుదలైన సినిమాల విషయంలో అంచనాలు రివర్స్ అయ్యాయి. దాంతో 'భాగమతి' విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి. మరో పక్క మంజుల తొలిసారి దర్శకత్వం వహించి, తెరకెక్కిస్తున్న 'మనసుకు నచ్చింది' సినిమా కూడా జనవరి 26నే విడుదల కానుంది. ఈ సినిమా ప్రోమోస్ కూడా బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. స్పెషల్‌గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. విడుదలయ్యాక ఏం జరుగుతుందో!
ముచ్చటగా మూడో సినిమాగా మంచు విష్ణు నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' ప్రేక్షకుల ముందుకు వస్తోంది కూడా ఈ రోజే. మంచు విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కొత్తగా అందర్నీ కడుపుబ్బా నవ్వించేలా ఉండబోతోందట. చూడాలి మరి, ఈ ఏడాది బాక్సాఫీస్ బొనాంజాకి ఏ సినిమా బోణీ కొడుతుందో!