కొత్త రిలీజ్ డేట్లతో టాలీవుడ్ హోరెత్తుతోంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా రిలీజ్ డేట్లు ప్రకటించేస్తున్నాయి. ఆచార్య కూడా కొత్త విడుదల తేదీతో వచ్చింది. ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే... ఒక్క రోజు ముందు... అంటే, ఏప్రిల్ 28న వెంకటేష్ `ఎఫ్3` విడుదల కానుంది. ఒక్క రోజు తేడాతో రెండు పెద్ద సినిమాలు విడుదల అవ్వడం పండగ లాంటి వాతావరణాన్ని తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే... రెండు చిత్రాల మధ్య క్లాష్ మాత్రం టాలీవుడ్ ని కలవరపెడుతోంది. రెండు సినిమాలూ పోటా పోటీగా విడుదల అవ్వడం సినీ ప్రేమికులకు ఇష్టమే. కానీ.. సరిపడే సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయా, లేదా? అనేది పెద్ద క్వశ్చన్.
ఎఫ్ 3... దిల్ రాజు సినిమా. నైజాంలో దిల్ రాజుకి తిరుగులేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ నైజాంలో ఎక్కువ థియేటర్లు ఎఫ్ 3 కైవసం అవుతాయి. ఏపీలోనూ దిల్ రాజు చేతుల్లో కొన్ని థియేటర్లు ఉన్నాయి. ఆ లెక్కన ఆచార్యకు సరిపడే సంఖ్యలో థియేటర్లు దొరక్కపోవచ్చు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆచార్యకు ఇది పెద్ద దెబ్బే. నిజానికి ఏప్రిల్ 1న `ఆచార్య`ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. మార్చి 25న `ఆర్.ఆర్.ఆర్` వస్తోంది. `ఆర్.ఆర్.ఆర్`కి కాస్త స్పేస్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో.. ఏప్రిల్ 1న `ఆచార్య`ని విడుదల చేయడం లేదు. కాకపోతే... ఏప్రిల్ 29న రావాలంట ఎఫ్ 3 అడ్డొస్తుంది. ఒకవేళ ఎఫ్ 3 టాక్ అటూ ఇటుగా ఉన్న పక్షంలో.. 29న విడుదలయ్యే ఆచార్యకు కావల్సిన థియేటర్లు దొరుకుతాయి. లేదంటే.. ఆచార్యకే కష్టం.