బాలకృష్ణ భోళా మనిషి. కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనుక ఒకలా ఉండడం ఆయనకు తెలీదు. అందుకే బయట కూడా చాలా సరదాగా, హుషారుగా ఉంటారు. కానీ.. అప్పుడప్పుడూ ఆయన చేష్టలూ, మాటలు విచిత్రంగా కనిపిస్తుంటాయి. దాన్ని పట్టుకుని కొంతమంది బాలయ్యని ట్రోల్ చేస్తుంటారు కూడా. ఇటీవల `సెహరి` అనే ఓ సినిమా వేడుకలో బాలయ్య ప్రవర్తన అందరికీ షాక్ కలిగించింది. ఫోన్, మైక్ విసిరికొట్టడం, హీరో చేతిని కొట్టడం.. `అంకుల్` అనగానే గుర్రుమని చూడడం.. వీటిని పట్టుకుని నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. వీటి చుట్టూ కామెడీ కథనాలు అల్లారు.
కాకపోతే.. అంతా బాలయ్యని అపార్థం చేసుకున్నారేమో అనిపిస్తోంది. బాలయ్య ఫోన్ మాటి మాటికీ రింగ్ అవుతోంటే.. మేనేజర్ని కాల్ లిఫ్ట్ చేయమని విసిరారట బాలయ్య. దాన్ని మేనేజర్ అందుకోలేకపోవడంతో అది కాస్త ముక్కలైంది. మరోవైపు.. హీరో పోస్టర్ ని ఎడమచేత్తో పట్టుకుంటే, `ఎడమచేయి మంచిది కాదు. కుడి చేత్తో పట్టుకో` అని చెప్పడానికి చేతిపై కొట్టార్ట. అంతే. దానికి ముందూ వెనుకా ఏం జరిగిందో చూపించకుండా.. కేవలం ఆ షాటే రిపీట్ గా చూపించడం వల్ల, ఆ హీరోని బాలయ్య కొట్టాడన్న యాంగిల్ లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తే.. బాలయ్య ఎందుకు అలా ప్రవర్తించాడన్నది అర్థం అవుతుంది. అది తెలుసుకోకుండా అనవసరంగా ఆయన్ని ట్రోల్ చేస్తున్నారంతే.