ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త తుది శ్వాస విడిచారు. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పని చేసినా ఏ పనీ చేయాలనిపించని బద్దకస్తుల్ని చాలా మందిని చూస్తుంటాం. మార్కులు తక్కువ వచ్చాయనో, ప్రేమలో ఫెయిలయ్యామనో, ఆర్థిక ఇబ్బందులొచ్చాయనో, ప్రాణాలు తీసుకుంటున్నవారిని చూస్తున్నాం. కానీ రెండు చేతులూ, రెండు కాళ్లూ చచ్చుబడిపోయి సరిగ్గా మాట కూడా మాట్లాడలేని ఓ వ్యక్తి మానవాళి గురించి తన జీవాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. తుది శ్వాస విడిచే వరకూ మానవాళి గురించే ఆలోచించాడు. అతనే 'స్టీఫెన్ హాకింగ్'.
ఐనస్టీన్ తర్వాత అంతటి గొప్ప శాస్త్రవేత్తగా స్టీఫెన్ హాకింగ్‌ని చెప్పుకుంటాం. ఆయన భౌతికంగా మన మధ్య లేరు. ఏలియన్స్‌ని కనుగొనే ప్రయత్నంలో వాటికి మన ఉనికిని తెలియజేస్తే మానవాళి మనుగడకే పెనుముప్పు అని హెచ్చరించిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. కళ్లు తప్ప శరీరంలో ఏ భాగం తనంతట తానుగా కదిలించలేని స్టీఫెన్ హాకింగ్ ప్రొఫిసర్‌గా పని చేస్తున్నారంటే ఎవరైనా నమ్మగలరా? గొప్ప శాస్త్రవేత్త కంటే, ఆయన్ని గొప్ప మార్గదర్శిగా మనం గుర్తు పెట్టుకోవాలి.
ఈ విషయాన్నే ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చెబుతూ, స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో సహా సినీ ప్రముఖులు నాగార్జున, వంశీ పైడిపల్లి, కొరటాల శివ తదితరులు స్టీఫెన్ హాకింగ్ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.