దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రాబోతోందంటూ ఎప్పడో అనౌన్స్‌మెంట్స్ జరిగాయి. అయితే అది ఒకటి కాదట. రెండు సినిమాలట. త్వరలోనే వాటిపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
తెలంగాణాలో ప్రస్తుత ముఖ్యమంతి కేసీఆర్ జీవిత చరిత్రపై కూడా సినిమా రానుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా ఒకటి కాదట. రెండు సినిమాలుగా ప్లాన్ చేస్తున్నారనీ తాజాగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఒకటి ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారట. ఆ తర్వాత మూడు నెలల గ్యాప్‌లో మరొకటి విడుదల చేయనున్నారట. ప్రముఖ నిర్మాత మధురా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు.
ఇదిలా ఉంటే, స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై ఎలాగూ మూడు చిత్రాలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాలయ్య - తేజ కాంబినేషన్‌లో 'ఎన్టీఆర్' టైటిల్‌తో తెరకెక్కుతోన్న బయోపిక్ ఒకటి కాగా, వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మరొకటి. ముచ్చటగా మూడోది కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'లక్ష్మీస్ వీరగ్రంధం'. ఇలా మూడు బయోపిక్స్ ఎన్టీఆర్‌పై తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
తాజాగా తెరపైకి వచ్చిన మరో బయోపిక్ ఏంటంటే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బయోపిక్. రాజకీయాల్లో చంద్రబాబు సీనియారిటీ సంగతి తెలిసిందే. ఆయన పాలనపై ఓ చిత్రం తెరకెక్కించే యోచనలో ఓ ప్రముఖ నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎలక్షన్స్‌కి ముందే ఈ చిత్రాన్ని తెరకెక్కించి, ఎలక్షన్స్ దగ్గర చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
అయితే ఎలక్షన్స్ టైంలో ఇలాంటి చిత్రాల జోరు కొనసాగడం మామూలే. వీటిలో చాలా వరకూ సినిమాలు అస్సలు సెట్స్ మీదికి వెళ్లవు. వెళ్లినా కొన్ని రిలీజ్ కావు. అయితే ఎన్టీఆర్ బయోపిక్స్ పక్కా. అలాగే కేసీఆర్ బయోపిక్ కూడా పక్కానే. మిగతా వాటిపై కంప్లీట్ డీటెయిల్స్ ఓ రెండు, మూడు నెలల్లోనే వెల్లడి కానున్నాయట.