ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా ఈ మధ్యకాలంలో ఏదన్నా ఉంటే అది రాజమౌళి 'ఈగ' మాత్రమే కావొచ్చు. ఇది అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవారిదాకా అందర్నీ అలరించింది 'ఈగ' సినిమా. ఇదే, బాలీవుడ్ దృష్టి రాజమౌళి వైపు మళ్ళేలా చేసింది. వివిధ భాషల్లో సంచలన విజయాన్ని అందుకున్న 'ఈగ', టెలివిజన్ రేటింగ్స్‌లోనూ ముందుంటోంది ఇప్పటికీ. ఎప్పుడొచ్చినాసరే 'ఈగ' సినిమాని టీవీల్లో మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు ఆడియన్స్, చూస్తూనే ఉంటారు కూడా. హీరో నాని సినిమాలో కనిపించేది తక్కువే అయినా, సినిమా అంతా ఈగ రూపంలో నానినే మనకి కన్పిస్తాడు. అంతలా ఆ కన్పించిన కాస్సేపే నాని, ప్రేక్షకుల మైండ్‌లో తన ఇమేజ్‌ని స్ట్రాంగ్‌గా ప్రింట్ చేసేశాడు. అలా ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన ఘనత డైరెక్టర్ రాజమౌళిది. అలాగే సమంత నటనను 'ఈగ' సినిమాలో ఎప్పటికీ మర్చిపోలేం. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, గ్రాఫిక్స్ అద్బుతాలు, సంగీతం, కన్నడ నటుడు సుదీప్ పెర్ఫామెన్స్ ఇవన్నీ 'ఈగ' సినిమాని వెరీ స్పెషల్‌గా నిలబెట్టాయి. ఈ సినిమా వచ్చి ఐదేళ్లయినప్పటికీ, ఈ సినిమాకి ఉన్న క్రేజ్ తగ్గడం లేదు. గ్రాఫిక్స్‌లో రాజమౌళి ఈ సినిమా విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అలాంటివి. అంతకన్నా గొప్ప సినిమాలు అనేకం వచ్చినప్పటికీ, ఈ మధ్యకాలంలో ఆ స్థానాన్ని మరే ఇతర సినిమా భర్తీ చేయలేకపోయింది. అదే 'ఈగ' స్పెషాటిలీ. దటీజ్ రాజమౌళి 'ఈగ'.