అసలే గోరు చుట్టు. ఆ పైన రోకలి పోటు అన్నట్టు తయారైంది చిత్రసీమ వ్యవహారం. కరోనా వల్ల షూటింగులు ఆగిపోయాయి. సామాజిక దూరం పాటిస్తూ, షూటింగులు చేసుకోవొచ్చని ప్రభుత్వాలు చెబుతున్నా - అనుమతులు వస్తున్నా - హీరోలు ధైర్యం చేయడం లేదు. ఇప్పుడు బరిలోకి దిగుదామంటే... నెత్తిన మరో పిడుగు పడింది. అకాల వర్షాలకు.. షూటింగ్ మూడ్ మొత్తం పోయింది. ఈ వర్షాలలో షూటింగులేంటి? అంటూ వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ సీజన్లో అంతు చిక్కని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
షూటింగులకు అడ్డా అయిన హైదరాబాద్ అయితే వర్షాలకు అల్లాడిపోతోంది. ఎప్పుడు ఏ స్థాయిలో వర్షం కురుస్తుందో చెప్పని పరిస్థితి. ఇలాంటి వర్షాలలో అవుడ్డోర్ షూటింగులు అసాధ్యం. ఈ వర్షాలకు కొన్ని సెట్స్ కూడా పూర్తిగా పాడైపోయాయని సమాచారం. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల షూటింగులు ఈ వర్షాల వల్లే ఆగిపోయాయని తెలుస్తోంది. మరోవైపు అక్కడక్కడ మల్టీప్లెక్స్ లు తెరిచారు. వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సినిమాకి వెళ్దాం అనుకున్నా, వర్షాల వల్ల జనాలు థియేటర్లకు రావడానికే జంకుతున్నారు. అలా... చిత్రసీమపై వర్షాలు సైతం తమ కోపాన్ని చూపిస్తున్నాయి.