గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
దర్శకత్వం: కృష్ణ చైతన్య 
 
నటీనటులు: విశ్వక్‌సేన్, నేహాశెట్టి, అంజలి

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: యువన్ శంకర్ రాజా 
ఛాయాగ్రహణం: అమిత్ మదాది
కూర్పు: నవీన్ నూలి
 
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌
విడుదల తేదీ: 31 మే 2024
 
ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5
 
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్  లేకుండా కేవలం సినిమాపై పిచ్చితో ఈ రంగంలోకి వచ్చాడు  విశ్వక్ సేన్. తన సినీ ప్రయాణంలో అనేక ఒడిడుకులు ఎదుర్కొన్నాడు. వివాదాలు, అవమానాలు, అన్నింటినీ జయించి ఇప్పుడిప్పుడే హీరోగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే ఏడాది మార్చి లో 'గామి' సినిమాతో వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అదే ఉత్సాహంతో రెండు నెలల వ్యవధిలో ఈ రోజు గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. ఈసారి తనకు ఎంతో ఇష్టమైన మాస్ గెటప్ లో కనిపించాడు. మరి ఈ సినిమాలో మాస్ కా దాస్ గా విశ్వక్ సఫలమయ్యాడా? తెలంగాణకి చెందిన విశ్వక్, గోదావరి కుర్రాడిగా మెప్పించాడా?
              
కథ : 
జులాయిగా తిరిగే వ్యక్తి రాజకీయ వ్యవస్థ మీద చేసే తిరుగుబాటు ఈ కథ. గోదావరి ప్రాంతంలోని కొవ్వూరులోని లంకలో అనాథగా పెరిగిన రత్నాకర్ (విశ్వక్సేన్)కు తన స్థాయిని మించి కలలు కంటాడు. ఆ కలలు నెరవేర్చుకోవడానికి ఎలాంటి తప్పులు చేయటానికైనా సిద్ద పడతాడు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు) రమణ దగ్గర చేరి నమ్మకస్తుడిగా మారుతాడు. అనుకోకుండా దొరస్వామిరాజు ప్రత్యర్థి నానాజీ (నాజర్) కూతురు బుజ్జి (నేహా శెట్టి ) ని ప్రేమిస్తాడు. కొన్ని అనూహ్య పరిణామాల త‌ర‌వాత‌ ఎమ్మెల్యే దొరస్వామిపై ప్రత్యర్థిగా మారి అతడిపై పోటీ చేసి గెలుస్తాడు. రత్నం MLA గా గెలిచాక ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, తన ప్రత్యర్థి దొరస్వామి రాజుని ఎదుర్కోవటానికి రత్నం ఎలాంటి అక్రమాలకి పాల్పడ్డాడు? తన వ్యక్తిగత, వృత్తి గత జీవితాలకి సంబంధించిన‌ విషయాలు, తను తీసుకున్న నిర్ణయాల‌ వలన,  ప్రేమించిన బుజ్జిని సొంతం చేసుకోగ‌లిగాడా లేదా, ర‌త్న (అంజలి)తో ఉన్న రిలేషన్ ఏంటి అనే అంశాలతో కథ సాగుతుంది. ఫైనల్ గా హీరో లక్ష్యం నెరవేరిందా? అతని కథ ఎలా ముగిసింది అనేది సినిమాలో చూడాల్సిందే. 
 
విశ్లేషణ : 
దర్శకుడు కృష్ణ చైతన్య  ముందే చెప్పాడు. గోదావరి అంటే కేవలం పచ్చదనం, అమాయకత్వం, మర్యాదలే  కాదు, ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని, అందుకే అవి చెప్పేందుకు, గ్యాంగ్ ఆఫ్ గోదావరి కథని ఎంచుకున్నట్లు చెప్పాడు. కథని కూడా అలాగే తెరకెక్కించాడు. సినిమా అక్కడక్కడా స్లో గా వెళ్తుంది అనుకునే లోపు స్పీడ్ అందుకుంటుంది. ప్రేక్షకుడి ద్రుష్టి మరల్చకుండా కథలో కూర్చో పెట్టగలిగాడు. తెలిసిన కథని కొత్తగా చెప్పాడు.  సినిమా మొత్తం మాస్ జాతరలా ఉంటుంది. కథకు తగ్గ యాక్షన్ సీన్స్ రాసుకున్నాడు. విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యాడు. సినిమాలో ప్రతి పాత్రకి తగిన స్కోప్ ఉంది. కథని రాసుకున్న విధానం కానీ, పాత్రలని కథానుగుణంగా నడిపించిన తీరు బాగుంది. హీరో చెప్పే కొన్ని డైలాగ్స్ తోనే అతని క్యారక్టరైజేషన్ అర్థం అయిపోతుంది. కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా తీర్చి దిద్దాడు. ఇంటర్వెల్ కి వచ్చే యాక్ష‌న్ ఎపిసోడ్‌ సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు. అక్కడక్కడా నేనే రాజు నేనే మంత్రి, పుష్ష‌, యం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ లాంటి సినిమాలు జ్ఞప్తికి వస్తాయి. ముఖ్యంగా నేనే రాజు - నేనే మంత్రి. అందులో కూడా రానా రాజకీయంగా  ఎదగటానికి ఎన్ని కుట్రలు, కుంతత్రాలు, చేస్తాడో, చివరికి ఎంతగానో ప్రేమించిన భార్యని మోసం చేయటం, హత్యలు, తన పతనం ఇవన్నీ గ్యాంగ్ ఆఫ్ గోదావరిలోకూడా కనిపిస్తాయి. హీరో తాను అనుకున్న విజయాన్ని సాదించటానికి చేసే ప్రయత్నాలు వాస్తవానికి విరుద్ధంగా సినిమాటిక్ గా ఉంటాయి. ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరుకునే విధానం, చివరికి పశ్చాత్తాపం చెంది అర్థవంతం అయిన ముగింపు ఇవ్వటం బానే ఉంది కానీ ఆ మార్పు ఎందుకు వచ్చింది అన్నది అంత ప్రభావవంతంగా చూపించలేకపోయారు. రత్నం జీవితం లో వచ్చిన మార్పును చూపించారు తప్ప, ఆ పాత్రలో ఎమోషన్స్ పెద్దగా చూపించలేదు. క్లైమాక్స్ మ‌రీ ఊహ‌కు అతీతంగా ఉండ‌దు కానీ, బాగుంది. ఓవరాల్ గా ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. 
 
నటీ నటులు: 
లంక‌ల ర‌త్న పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ చ‌క్క‌గా అమ‌రాడు. విశ్వ‌క్‌లోని మాస్ యాంగిల్ డిఫ‌రెంట్‌గా ఉంది. నటన పరంగా విశ్వక్ మరో సారి మెప్పించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు అనటంలో సందేహం లేదు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నవరసాలు పండించాడు. ఇప్పటివరకు తెలంగాణ కుర్రాడిగా నటించిన విశ్వక్ మొదటిసారి గోదావరి యాసలోనూ అద‌ర‌గొట్టాడు. ఈ కథకి విశ్వక్ పర్ఫెక్ట్ అనిపించేలా చేసాడు. నేహా శెట్టి ఇప్పటివరకు చేసిన పాత్రలకి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రల్లో మెరిసిన నేహా ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని ఎమోషన్ సీన్స్ లో మెప్పించింది. సినిమా మొత్తం ట్రెడిషన్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. నేహా గ్లామర్ కూడా  ఈ మూవీకి ప్లస్ అయ్యింది. అంజలి సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. ఈ మూవీలో అంజలి నటన  ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంజలి  విశ్వక్ సేన్  తో కలిసి నటించిన కొన్ని సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. నాజర్, గోప‌రాజు ర‌మ‌ణ తమ‌దైన శైలిలో నటించారు. మిగతా పాత్రలు తమ పరిధి మేర ఉన్నాయి. 
 
టెక్నికల్: 
యువన్ శంకర్ రాజా చక్కటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. రెండు మూడు పాటలు వినసొంపుగా ఉన్నాయి.బీజీఎమ్ ఆకట్టుకునేలా ఉంది. మాస్ యాక్షన్ కి తగ్గా బీజీఎమ్ అందించాడు యువన్. అమిత్ అందించిన విజువల్స్ కూడా బాగున్నాయి. కథానుసారంగా దర్శకుడి రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. 
 
ప్లస్ పాయింట్స్
విశ్వక్ సేన్
కొన్ని డైలాగ్స్
సంగీతం 
యాక్షన్ సీన్స్ 
 
మైనస్ పాయింట్స్
స్లో నరేషన్     
ఆకట్టుకోని విలనిజం    
 
ఫైనల్ వర్దిక్ట్ : ఊర మాస్ గ్యాంగ్ స్టర్ స్టోరీ..!

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS