తారాగణం: రానా, కెకె మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ, ఓంపురి, నాజర్, సత్యదేవ్, భరత్‌రెడ్డి తదితరులు.
నిర్మాణం: పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
సినిమాటోగ్రఫీ: మది
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: కె
దర్శకత్వం: సంకల్ప్
విడుదల తేదీ: ఫిబ్రవరి 17, 2017
కథా కమామిషు:
దేశభక్తి సినిమాలతో ఆడియన్స్‌ని మెప్పించేయడం చాలా తేలికనుకుంటారు. కానీ అన్ని సందర్భాల్లోనూ అది కుదరదు. బలమైన భావోద్వేగాల్ని అంతే గొప్పగా తెరపై చూపించగలగాలి. అలాంటి సినిమాలే విజయవంతమయ్యాయి. 'ఘాజీ' సినిమా కథ దగ్గరకొస్తే ఇండియాకి చెందిన సబ్‌మెరైన్ ఎస్21 - పాకిస్తానీ జలాంతర్గామి ఘాజీ మధ్య జరిగే 'వాటర్ వార్' ఈ చిత్ర కథ. భారత నేవీ అధికారులైన లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ (రానా), కెప్టెన్ రణ్ విజయ్ సింగ్ (కెకె మీనన్)య 18 రోజులపాటు ఎంత సాహసోపేతంగా పోరాడి, ఘాజీ దాడి నుంచి విశాఖపట్నంను కాపాడారో తెలియాలంటే తెరపై చూడాలి.
నటీనటులెలా చేశారు:
నటుడిగా రాణా ఇప్పటికే తన నటనా ప్రతిభను చాటుకున్నాడు పలు సినిమాలతో. అంతెత్తున కనిపించే రానా తన ఫిజిక్‌తోనే మంచి ప్రెజెన్స్‌ని ఇవ్వగలుగుతాడు. నేవీ అధికారిగా రానా బాగా కుదిరాడు. అర్జున్ పాత్ర తప్ప అందులో రానా కన్పించడనేంతలా పాత్రలో ఒదిగిపోయాడు. కెకె మీనన్ కూడా తన పాత్రలో జీవించేశాడు. తాప్సీకి మాత్రం అంతగా ప్రాధాన్యత లేని పాత్ర దక్కింది. ఓంపురి, నాజర్ కూడా చిన్న చిన్న పాత్రల్లోనే కనిపించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
సాంకేతిక విభాగం గురించి చెప్పుకోవాలంటే ముందుగా విజువల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకోవాలి. అవసరమైనంతగా అద్భుతంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువగా చేసే అవకాశం ఉన్నా లిమిటెడ్‌గా బాగా చేశారు. అలాగే ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కృషి చాలా అద్భుతం. సినిమా చూస్తున్నట్లు కాకుండా, ఆ యుద్ధం జరిగినప్పుడు అక్కడే మనం ఉన్నామనే భావన కల్పించారు. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం. కథ, కథనం పరంగా దర్శకుడి తపన కనిపిస్తుంది. ఎంతగా ఈ కథను దర్శకుడు ప్రేమించాడో అర్థమవుతుంది. ఎడిటింగ్ బాగుంది. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. స్క్రీన్‌ప్లే సినిమాకి అదనపు బలాన్నిచ్చింది.
విశ్లేషణ:
మొదట్లోనే చెప్పుకున్నట్లు దేశభక్తి చిత్రాల్లో యూనివర్సల్ అప్పీల్ ఉండాలి. కథలో బలం ఉండటం ముఖ్యం. స్క్రీన్‌ప్లేని పరుగులు పెట్టించినప్పుడే దేవభక్తి సినిమాల్ని తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అందులో మమేకం అవుతారు. లేదంటే వెంటనే విమర్శలొచ్చేస్తాయి. ఇవన్నీ దర్శకుడు జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని సినిమా చేశాడు. నటీనటుల ఎంపిక దగ్గర్నుంచి, సబ్‌మెరైన్ సెట్ వేసెయ్యాలనే ఆలోచన దాకా అన్ని చోట్లా దర్శకుడి మార్క్ కనిపిస్తుంది. సినిమాని గ్రిప్పింగ్‌గా మలచడంలో దర్శకుడు చూపిన ప్రతిభ ప్రేక్షకుడ్ని సినిమాలో లీనమయ్యేలా చేసింది. స్టార్టింగ్ టు ఎండింగ్ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకపోవడం దర్శకుడి ప్రత్యేకత. సబ్‌మెరైన్ నేపథ్యంలో ఇప్పటిదాకా మనం మన ఇండియన్ సినిమా స్క్రీన్‌పై చూడలేదు. ఈ చిత్రంలో సబ్‌మెరైన్ ద్వారా కొత్త అనుభూతిని కల్గించాడు దర్శకుడు. సబ్‌మెరైన్ గురించి అయినా ఖచ్చితంగా అందరూ చూడాలనుకునే ఈ సినిమాని తన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో గొప్పగా మలచిన దర్శకుడికి అభినందలు తెలపాలి.
ఫైనల్ వర్డ్: 'ఘాజీ' సూపర్ గుడ్ అటెంప్ట్
రివ్యూ బై: శేఖర్