గోపీచంద్ - నయనతారలు కలిసి ఓ సినిమా చేశారు. గుర్తుందా? ఆ సినిమానే `ఆరడుగుల బుల్లెట్`. బి.గోపాల్ ఈ చిత్రానికి దర్శకుడు. అసలు ఈ కాంబినేషనే ఓ విచిత్రమైన కాంబినేషన్. దానికి తగ్గట్టు.. ఈ సినిమాని ఎన్నో స్పీడు బ్రేకర్లు. చాలాసార్లు విడుదల తేదీ ప్రకటించారు. కానీ.. సినిమా మాత్రం బయటకు రాలేదు. ఈ సినిమాని ఆర్థిక సమస్యలు తరుముకొచ్చాయి. చివర్లో నయనతార కూడా తన డేట్లు ఇవ్వడానికి బెట్టు చేసింది. దాంతో.. `ఆరడుగుల బుల్లెట్` కాస్త పిస్తోల్ లోనే ఉండిపోయింది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తారని కూడా అనుకున్నారు. అదీ కుదర్లేదు.
ఇంతకాలానికి ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలు రంగం సిద్ధం చేశారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసి, థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఏపీలో కూడా థియేటర్లు తెరచుకుంటే, వెంటనే ఈ సినిమాని విడుదల చేసేస్తారు. అంటే... రెండు తెలుగు రాష్ట్రాల్లో, థియేటర్ల రీ ఓపెన్ తరవాత... రాబోతున్న తొలి సినిమా ఇదే. ఇప్పుడైనా ఈ సినిమా బయటకు వస్తుందా, లేదంటే చివరి క్షణాల్లో కొత్త ఆటంకాలు ఏమైనా వస్తాయా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.