హీరోల ఆలోచన మారింది. ప్రతీ హీరో తనకో సొంత నిర్మాణ సంస్థ ఉండి తీరాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేస్తున్నాడు. అలాగైతే పారితోషికంతో పాటు సినిమాలో వాటా కూడా దక్కుతుంది. అగ్ర హీరోలందరికీ సొంత బ్యానర్లు ఉన్నాయి. గతంలో గోపీచంద్ కి సైతం ఓ సొంత నిర్మాణ సంస్థ ఉండేది. అదే.. ఈతరం మూవీస్. పోకూరి బాబూరావు ఈ సినిమాలకు నిర్మాతగా ఉండేవారు. తొలి రోజుల్లో గోపీచంద్ సినిమాలన్నీ ఈ బ్యానర్ లోనే. అయితే కొన్నేళ్లుగా ఈ సంస్థ యాక్టీవ్ గా లేదు. గోపీచంద్ కూడా తన సినిమాల్ని బయట బ్యానర్లలోనే చేస్తున్నాడు. అయితే త్వరలోనే ఈ సంస్థని మళ్లీ పట్టాలెక్కించాలన్న ప్రయత్నాల్లో గోపీచంద్ ఉన్నాడు. ఇదే విషయాన్ని క్లారిటీగా చెప్పాడు కూడా.
``ఈతరం మూవీస్ లో మళ్లీ సినిమాలు చేయాలని ఉంది. అయితే ఇప్పుడే కాదు. కొంత సమయం పడుతుంది. కాస్త లేట్ అయినా మా బ్యానర్‌లో మంచి సినిమాలే వస్తాయి`` అన్నాడు. ఇప్పుడు ఓటీటీల జోరు పెరిగింది. వాళ్లకు కంటెంట్ అవసరం. అందుకే పాత నిర్మాణ సంస్థలన్నీ యాక్టీవ్ అవుతున్నాయి. ``ఓటీటీలు మంచి ఆప్షన్. మన టాలెంట్ ని నిరూపించుకునేందుకు మరో వేదిక. దాన్ని వీలైనంత బాగా ఉపయోగించుకోవాలి`` అంటున్నాడు గోపీచంద్. ఓటీటీల కోసమైనా గోపీచంద్ సినిమాలు తీస్తాడేమో చూడాలి.