రామ‌బాణం మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: రామ‌బాణం
నటీనటులు: గోపీచంద్, జగపతిబాబు, డింపుల్ హయతి, కుష్బూ
దర్శకత్వం: శ్రీవాస్
 

నిర్మాత: టిజి విశ్వప్రసాద్
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: వెట్రి పళనిసామి
కూర్పు: ప్రవీణ్ పూడి
 

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 5 మే 2023

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5
 

హిట్ కాంబినేష‌న్‌కి ఉన్న క్రేజే వేరు. వ‌రుస‌గా రెండు హిట్లిచ్చిన హీరో, ద‌ర్శ‌కుడు మ‌ళ్లీ సినిమా చేస్తున్నారంటే.. అంచ‌నాలు అమాంతం పెరిగిపోవ‌డం అత్యంత స‌హ‌జంగా క‌నిపించే విష‌యం. రామ‌బాణంపై కూడా అలానే హైప్ పెరిగింది. ఎందుకంటే ల‌క్ష్యం, లౌక్యంతో రెండు హిట్లు కొట్టారు గోపీచంద్ - శ్రీ‌వాస్‌. దుర‌దృష్టం ఏమిటంటే.. లౌక్యం త‌ర‌వాత అటు గోపీచంద్ కి గానీ, ఇటు శ్రీ‌వాస్‌కి గానీ సాలీడ్ హిట్స్ లేవు. ఇద్ద‌రూ త‌మ‌ని తాము నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ క‌లిసి... ఓ సినిమా చేశారు. అదే.. రామ‌బాణం. మ‌రి ఈ సినిమాతో వీళ్లిద్ద‌రూ హ్యాట్రిక్ కొట్టారా?  గోపీచంద్ ఫామ్ లోకి వ‌చ్చాడా?


కథ‌: ప‌దిహేడేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిన విక్కీ (గోపీచంద్) మ‌ళ్లీ ఇంటిని, త‌న వాళ్ల‌నీ వెదుక్కొంటూ వ‌స్తాడు. అలా రావ‌డానికి ఓ కార‌ణం ఉంది. కొల‌కొత్తాలో  భైర‌వి (డింపుల్ హ‌య‌తి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు విక్కీ. త‌న‌ని పెళ్లి చేసుకోవాలంటే త‌న‌కో కుటుంబం కావాలి. అందుకే.. ప‌దిహేడేళ్ల క్రితం అన్న‌య్య (జ‌గ‌ప‌తిబాబు)తో గొడ‌వ ప‌డి వెళ్లిపోయిన విక్కీ... మ‌ళ్లీ ఇంటికి రావాల్సివ‌స్తుంది. అయితే... ఇక్క‌డ కుటుంబ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోతాయి. త‌న అన్న‌య్య‌కు బిజినెస్‌మేన్ జీకే (త‌రుణ్ అరోరా) నుంచి ప్ర‌మాదం పొంచి ఉంటుంది. ఇంత‌కీ... ఆ ప్ర‌మాదం ఏమిటి?  విక్కీ త‌న కుటుంబానికి ఎందుకు దూరం అవ్వాల్సివ‌చ్చింది?  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో విక్కీ త‌న ఫ్యామిలీని ఎలా కాపాడుకొన్నాడు?  అనేది మిగిలిన క‌థ‌.


విశ్లేష‌ణ‌: శ్రీ‌వాస్‌కి క‌మ‌ర్షియ‌ల్ సినిమాని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. ల‌క్ష్యం, లౌక్యం అలాంటి క‌థ‌లే. అయితే... ఆ క‌థ‌ల్లో కొత్త‌ద‌నం లేక‌పోయినా, క‌థ‌ని న‌డిపించిన విధానం మాత్రం కొత్త‌గానే ఉంటుంది. ఈ రెండు చిత్రాల్లోనూ కామెడీ, ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ అయ్యాయి. అందుకే అవి రెండూ పెద్ద హిట్లుగా నిలిచాయి. ఈసారి కూడా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌నే ఎంచుకొన్నాడు శ్రీ‌వాస్‌. కాక‌పోతే. ఆ క‌థ పూర్తిగా పాద‌ది. దాని ట్రీట్ మెంట్ కూడా అలానే ఉంటుంది. హీరో చిన్న‌ప్పుడే ఇల్లు వ‌దిలి వెళ్లిపోవ‌డం, కొల‌కొత్తాలో డాన్ గా ఎద‌గ‌డం, త‌న దాదాగిరి ప‌క్క‌న పెట్టి, ఇంట్లోవాళ్ల కోసం ఎడ్జిస్ట్ అవ్వ‌డం.. ఇవ‌న్నీ చాలా సినిమాల్లో చూసిన అంశాలే. వాటినే అటు తిప్పి, ఇటు తిప్పి మ‌ళ్లీ చూపించాడు శ్రీ‌వాస్‌. తెర‌పై వ‌స్తున్న సీన్లు చూస్తుంటే శ్రీ‌వాస్ క‌థ‌ని కాకుండా కాంబినేష‌న్‌నే బ‌లంగా న‌మ్మిన‌ట్టు అనిపిస్తుంది.


ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్‌, దాన్ని అడ్డుకోవాల‌ని చూసే విల‌న్ గ్యాంగ్ చేష్ట‌లు ఇవ‌న్నీ ప‌ర‌మ రోత‌గా అనిపిస్తాయి. త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి హీరో చేసే ప్ర‌య‌త్నాలు లాజిక్‌కి దూరంగా, ఎమోష‌న్ లెస్‌గా అనిపిస్తాయి. ఫ్యామిలీ సెంటిమెంట్, అన్న‌ద‌మ్ముల స్టోరీ అన్నారు కానీ.. వాటిపై కూడా ద‌ర్శ‌కుడు ఫోక‌స్ పెట్ట‌లేదు. క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ కూడా బ‌లంగా లేదు. ఎమోష‌న్లు లేక‌పోవ‌డంతో సీన్లు.. టీవీ సీరియ‌ల్స్ లా సాగుతూ వెళ్లాయి. ఇంట్ర‌వెల్ ఫైట్ తో పూన‌కాలు వ‌స్తాయి.. అని ద‌ర్శ‌కుడు ముందే చెప్పాడు. ద‌ర్శ‌కుడు చెప్పిన స్థాయిలో లేకపోయినా.. ఈ సినిమాలో కాస్తో కూస్తో ఆక‌ట్టుకొనే అంశం ఉందంటే.. అది ఇంట్ర‌వెల్ ఫైటే.


ద్వితీయార్థంలో హీరో - విల‌న్ మ‌ధ్య సాగే టిట్ ఫ‌ర్ టాట్ ఫైట్‌.. థ్రిల్లింగ్ గా న‌డిపితే బాగుండేది. అక్క‌డా.. ద‌ర్శ‌కుడు కొత్త‌గా ఆలోచించ‌లేక‌పోయాడు. ఈమ‌ధ్య చూసిన చాలా సినిమాలు, అందులోని స‌న్నివేశాలు గుర్తొస్తుంటాయి. కామెడీ ఎక్క‌డా వ‌ర్క‌వుట్ కాలేదు. లాజిక్ కి అంద‌ని స‌న్నివేశాలు చాలా ఉంటాయి. ప‌తాక స‌న్నివేశాల్లో కోర్టు వాద‌న‌లు, ఆర్గానిక్ ఫుడ్ గురించీ,  సేంద్రియ వ్య‌వ‌సాయం గురించి చ‌ర్చించ‌డం... ఇలాంటి క‌థ‌ల్లో అన‌వ‌స‌రం. అవ‌న్నీ మంచి పాయింట్లే కావొచ్చు. కానీ... అప్ప‌టికే సినిమాపై ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి పూర్తిగా స‌న్న‌గిల్లుతుంది. అలాంట‌ప్పుడు తెర‌పై ఏం చెప్పినా వినిపించుకొనే ప‌రిస్థితి ఉండ‌దు.

 

న‌టీన‌టులు: ఈ సినిమాలో గోపీచంద్ కొత్త‌గా చేయ‌డానికి ఏం లేదు. ఇది వ‌ర‌క‌టిలానే ఎన‌ర్జిటిక్ గా న‌టించాడు. ఫైట్లు బాగా చేశాడు. జ‌గ‌ప‌తిబాబుతో కొన్ని సీన్ల‌లో త‌న న‌ట‌న బాగుంది. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, స‌చిన్ ఖేడ్క‌ర్ ఇలాంటి అనుభ‌వజ్ఞులు ఉండ‌డం వ‌ల్ల ఆయా స‌న్నివేశాలు కాస్త పండాయి. హాస్య న‌టులు చాలామందే ఉన్నారు కానీ.. వాళ్ల వ‌ల్ల ఈ సినిమాకి ఉప‌యోగం లేదు. డింపుల్ హ‌య‌తి రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది.

 

సాంకేతిక వ‌ర్గం: మిక్కీ పాట‌ల్లో ఏదీ గుర్తు ఉండ‌దు. నేప‌థ్య సంగీతం కూడా సో..సోగా ఉంటుంది. అయితే కెమెరా వ‌ర్క్ ఆక‌ట్టుకొంటుంది. సంభాష‌ణల్లో సందేశాలు, పాత పంచులు క‌నిపిస్తాయి. ఈ సినిమా కోసం నిర్మాత‌లు భారీగా ఖ‌ర్చు పెట్టారు. అదంతా తెర‌పై క‌నిపిస్తుంది. అయితే ఇంత డ‌బ్బు.. ఓ పేల‌వ‌మైన క‌థ‌పై పెట్టాడు శ్రీ‌వాస్‌. క‌థ‌, క‌థ‌నంలో ఏమాత్రం కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఓ రొటీన్ సినిమా చూస్తున్న ఫీలింగే ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది.


ప్ల‌స్ పాయింట్స్‌:

భారీద‌నం
క‌మ‌ర్షియ‌ల్ హంగులు


మైన‌స్ పాయింట్స్‌:

రొటీన్ క‌థ‌
క‌థ‌నం
సీరియ‌ల్ లాంటి స‌న్నివేశాలు


ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: బాణం... గుచ్చుకొంది!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS