ఒలింపిక్స్‌లోనో, ఆసియా క్రీడల్లోనో, కామల్ వెల్త్ గేముల్లోనో... భారతదేశానికి పతకం సాధిస్తే... ప్రభుత్వాలు మురిసిపోతాయి. వాళ్లకు అవార్డులూ, రివార్డులూ ఇవ్వడానికి పోటీ పడతాయి. పతకం తెచ్చుకోవడం ఆలస్యం.. మరుసటి రోజే... నజనారాలు ప్రకటించేస్తారు. క్రీడలకు ఉన్న ప్రాముఖ్యం అలాంటిది. అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల పతాకం రెపరెపలాడితే.. ఆ ఉద్వేగం అలాంటిది. మరి.. సినిమా అలాంటిది కాదా? ఆస్కార్‌కి అంత స్థాయి లేదా?
ఆర్.ఆర్.ఆర్ తో... మన దేశానికి ఆస్కార్ వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు తెచ్చుకొన్న తొలి భారతీయ చిత్రం.. ఆర్.ఆర్.ఆర్. అసలు మన దేశానికి ఆస్కార్ అందని ద్రాక్ష అనుకొంటున్న దశలో, ఆస్కార్ మనకు రాదులే.. అని లైట్ తీసుకొన్న పరిస్థితుల్లో, ఆర్.ఆర్.ఆర్ ని సాధించింది రాజమౌళి టీమ్. కానీ... ఈ ఘనతని ప్రభుత్వాలు గుర్తించాయా? అని ప్రశ్నించుకొంటే నిరాశే మిగులుతుంది.
ఆస్కార్ వచ్చిన తరవాత... కీరవాణి, చంద్రబోస్ ద్వయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభినందించడం తప్ప, నజరానాలు ప్రకటించలేదు.కనీసం ఏపీ నుంచి జగన్ గానీ, తెలంగాణ నుంచి కేసీఆర్ గానీ... ఆర్.ఆర్.ఆర్ బృందాన్ని సచివాలయానికి పిలిపించుకొని, అభినందించిన సన్నివేశం కనిపించలేదు. తెలుగు చిత్రసీమ సైతం... ఆస్కార్ విజేతల్ని ప్రత్యేకంగా గౌరవించడానికి ఓ వేదిక కల్పించలేదు. ఈ విషయాల్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ని చూసి మన సీఎంలు చాలా నేర్చుకోవాలి. ఎలిఫెంట్ విష్పరస్ షార్ట్ ఫిల్మ్ కి ఆస్కార్ వచ్చింది. ఆ ఆస్కార్ విజేతల్ని స్టాలిన్ తన కార్యాలయానికి పిలిపించి, అభినందించడమే కాకుండా.. కోటిరూపాయల నజరానా ప్రకటించారు. మావటిలకు ప్రత్యేక వరాలు కురిపించారు. మన వాళ్లు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రేమో... ఎం.ఎల్.సీలు పోయిన బాధలో ఆస్కార్ ఖ్యాతి గుర్తుకు రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రికేమో.. కవితని ఎలా కాపాడుకోవాలో అన్న కంగారు ఉంది. అందుకే వీళ్లకు ఆస్కార్ కనిపించలేదు. సినిమా వాళ్లని ఏమాత్రం పట్టించుకోకపోవడం తెలుగు ముఖ్యమంత్రులకు అలవాటే. ఇవ్వాల్సిన నంది, సింహా అవార్డులే మాయం అయిపోయాయి. ఇక పక్క దేశం వాళ్లిచ్చిన ఆస్కార్‌లను ఇంకెందుకు గౌరవిస్తారు?