చారిత్రాత్మక, కళ్లు చెదిరిపోయే కట్టడాలను సెట్స్ రూపంలో చూపించేయగల సత్తా ఉన్న డైరెక్టర్ గుణశేఖర్. మంచి విజన్ ఉన్న డైరెక్టర్. 'ఒక్కడు', 'రుద్రమదేవి' సినిమాల్లోని సెట్స్‌కి విజువల్‌గా ఆయన చూపించిన మాయాజాలానికి ఫిదా అయిపోయారు తెలుగు ఆడియన్స్. ఎక్కువ టైం తీసుకున్నా, పర్ఫెక్షన్తో పని పూర్తి చేస్తాడు. ప్రతీ సినిమాని ఓ యజ్ఞంలానే భావిస్తాడు. అందుకే ఆయన కష్టం అంతా తెరపై కనిపిస్తుంది. తాజాగా గుణశేఖర్ విజన్ నుండి మరో సినిమా రూపుదిద్దుకోబోతోందట.
ఆ సినిమాలో హీరోగా రానా నటిస్తున్నాడు. 'బాహుబలి'లాగానే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రం రూపొందబోతోందట. టెక్నికల్‌గా తెలుగు సినిమా ఎందులోనూ తీసిపోదు అని ఆల్రెడీ 'బాహుబలి'తో ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు రానా, గుణశేఖర్ కాంబోలో రాబోతోన్న చిత్రం కోసం విజువల్ ఎఫెక్ట్స్‌ని భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాను సాంకేతికంగా అత్యున్నతంగా మలిచేందుకు రానా, గుణశేఖర్ కలసి దేశ విదేశాల్లో గాలించి అత్యుత్తమ టెక్నీషియన్స్‌ని హోల్డ్‌లో పెట్టి ఉంచారట. త్వరలోనే సినిమా సెట్స్ మీదికెళ్లనుంది.
సురేష్‌బాబు బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారట. 'హిరణ్య' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. పురాణాల గురించి మరీ అంత లోతుగా తెలియకపోయినా, హిరణ్యకశిపుడు అనే రాక్షసుని పాత్ర గురించి చిన్నా, పెద్దా అందరికీ పరిచయమే. ఆ రాక్షసుడి కథ ఆధారంగానే ఈ సినిమాకి స్క్రిప్టు ప్రిపేర్ చేశాడు గుణశేఖర్. గత రెండేళ్లుగా ఈ స్క్రిప్టుపై కసరత్తులు చేస్తున్నాడు. ఎట్టకేలకు అదిరిపోయే స్టోరీ ప్రిపేర్ చేశాడు. హీరో, విలన్, చిన్న క్యారెక్టర్ అనే తేడా లేకుండా విలక్షణ పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయే రానా ఈ క్యారెక్టర్ పోషిస్తున్నాడు.