తారాగణం: మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్, సంపత్, కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ తదితరులు
నిర్మాణం: క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సినిమాటోగ్రఫీ: సిద్దార్ధ్
సంగీతం: డిజె వసంత్
దర్శకత్వం: ఎస్ కె సత్య
నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి
*కథా కమామిషు:
చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం, మంచు మనోజ్ నటించిన ఫుల్ మాస్ మూవీ కావడం, ప్రగ్యా జైస్వాల్ ఇవన్నీ 'గుంటూరోడు' సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేశాయి. కథలోకి వెళితే, గుంటూరు కుర్రాడు కన్నా (మనోజ్) ఊళ్ళో అందరితోనూ గొడవలు పడుతుంటాడు. పెళ్ళి చేసేస్తే కుదురుకుంటాడని భావించిన అతని తండ్రి సూర్యనారాయణ (రాజేంద్రప్రసాద్) పెళ్ళిచూపులు ఫిక్స్ చేస్తాడు. పెళ్ళిచూపుల్లో పెళ్ళికుమార్తె పక్కన ఉన్న అమ్మాయి అమృత (ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు. క్రిమినల్ లాయర్ శేషు (సంపత్) చెల్లెలు అమృత. అతనితో కన్నాకి శతృత్వం ఏర్పడుతుంది. మరి కన్నా, శేషుని ఒప్పించి అమృతని పెళ్ళాడా? తండ్రి ఆశించినట్లు కన్నా గొడవలకు దూరమయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
*నటీనటులెలా చేశారు:
మాస్ సినిమా కావడంతో మనోజ్ ఎనర్జీకి హద్దూ అదుపూ లేకుండా పోయింది. కంప్లీట్ ఎనర్జీతో కనిపించాడు మనోజ్. హుషారుగా తెరపై మనోజ్ కనిపించడమే పెద్ద హైలైట్. డాన్సులు, ఫైట్లు అదరగొట్టేశాడు. సెంటిమెంట్ సీన్స్‌లోనూ బాగా చేశాడు. మొత్తంగా మనోజ్ ఈ సినిమాకి అన్నీ తానే అన్నట్టుగా చేశాడు.
ప్రగ్యా జైస్వాల్ అందంగా ఉంది. ఆమె తన పాత్రకు న్యాయం చేసింది.
క్రిమినల్ లాయర్ పాత్రలో సంపత్ బాగా చేశాడు. రాజేంద్రప్రసాద్, మనోజ్ తండ్రిగా ఆకట్టుకుంటాడు. కోట శ్రీనివాసరావు తన అనుభవాన్ని రంగరించారు. పృధ్వీ, ప్రవీణ్, సత్య తదితరులు కామెడీతో ఫర్వాలేదన్పించారు.
*విశ్లేషణ:
కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నా, దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా మలచగలిగితేనే మంచి విజయం దక్కుతుంది. ఈ సినిమా విషయంలో దర్శకుడు రొటీన్ కమర్షియల్ సినిమా ఫార్మాట్‌ని ఫాలో అయిపోయాడు. కొత్తదనం కోసం పెద్దగా ప్రయత్నించలేదు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మాస్ మెచ్చే అంశాల్ని జొప్పించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం ఓకే అనిపిస్తుంది. అక్కడక్కడా ఎడిటింగ్ ఇంకాస్త బాగా చేసి ఉంటే బాగుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకాస్త ఎక్కువ ఉండాల్సింది. హీరోయిన్ గ్లామర్, మాస్‌ని మెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్, లౌడ్ డైలాగ్స్ ఇవన్నీ ఓకే. ఓవరాల్‌గా సినిమా ఓ సాధారణ మాస్ ఎంటర్‌టైనర్ అనిపించుకుంటుంది.
*బలాలు
- యాక్షన్ సీన్స్
- కెమెరా పనితనం
- డైలాగ్స్
- మ్యూజిక్
*బలహీనతలు
- రొటీన్ స్టొరీ
*సాంకేతిక వర్గం పనితీరు:
కథ కొత్తదేమీ కాదు, కథనం కూడా మామూలే. సగటు మాస్ సినిమాని కమర్షియల్ అంశాలతో తెరకెక్కించడానికి దర్శకుడు సత్య తనవంతు కృషి చేశాడు. కథ మీద, ఎంటర్‌టైన్‌మెంట్ మీదా, కథనం మీదా ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది. టెక్నికల్‌గా ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మాటలు బాగున్నాయి. పాటలు ఓకే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఫైట్స్ బాగున్నాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.
*ఫైనల్ వర్డ్:
'గుంటూరోడు' రొటీన్ అనిపించాడు.
యూజర్ రేటింగ్: 2.5/5
రివ్యూ బై: శేఖర్