'హనుమాన్' అద్భుతం సృష్టించింది. పెద్ద పెద్ద సినిమాలకే సాధ్యం కాని రూ.200 కోట్ల క్లబ్‌లో దర్జాగా ప్రవేశించింది. ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా, అతి తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా క్రమంగా తన హవా చూపించుకొంటూ, తన జోరు ప్రదర్శిస్తూ వాయు వేగంతో బాక్సాఫీసుని కొల్లగొట్టింది. రూ.27 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 100, 150.. ఇప్పుడు రూ.200 కోట్లంటూ కొత్త మైలు రాళ్లు దాటుకొంటూ వెళ్లిపోయింది.
హనుమంతుడి కంటే పాన్ ఇండియా సబ్జెక్ట్ ఏముంటుంది? అందుకే ఈ సినిమాలో బడా స్టార్లు లేకపోయినా, దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లు దక్కించుకోగలిగింది. ఓవర్సీస్‌లోనూ హనుమాన్ దే హవా. గుంటూరు కారం ప్రదర్శన అక్కడ అంతంత మాత్రమే. దాంతో హనుమాన్‌కి మరింత స్పేస్ దక్కింది. రెండో వారంలో టికెట్ రేటుకి సగానికి సగం తగ్గించడం హనుమాన్‌కి మరింత కలిసొచ్చింది.
ఈరోజు అయోధ్యలో రామమందిర మహోత్సవం వైభవంగా జరుగుతున్న వేళ... హనుమాన్ 200 కోట్లు సాధించిన విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది . స్టార్ హీరోల చిత్రాలు రూ.200 కోట్లు సాధించడంలో పెద్ద వింతేం ఉండదు. కానీ ఓ చిన్న సినిమా ఇలాంటి మైలు రాయిని అందుకోవడం నిజంగా గొప్ప విషయమే. రాబోయే చిన్న చిత్రాలకు ఈ విజయం మరింత ఉత్సాహాన్ని, ధైర్యాన్నీ అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.