పవన్ కల్యాణ్ లాంటి స్టార్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడు మాత్రం ఆశ పడడు. పైగా హరీష్ శంకర్ పవన్‌కు వీరాభిమాని. ఇది వరకే `గబ్బర్ సింగ్`తో తన స్టామినానీ, పవన్‌పై ఇష్టాన్నీ చూపించుకున్నాడు. తనకు ఇప్పుడు రెండో అవకాశం వచ్చింది. అందుకే... మరింత ఉవ్విళ్లూరిపోతున్నాడు. పవన్ - హరీష్ కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా విడుదల చేసేశారు.
అయితే ఈ సినిమాని వీలైనంత త్వరగా పట్టాలెక్కించేయాలని ఆరాటపడిపోతున్నాడట హరీష్. నిజానికి పవన్ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. `వకీల్ సాబ్` పూర్తయిన వెంటనే.. క్రిష్ సినిమా మొదలెట్టాలి. ఆ తరవాతే.. హరీష్ సినిమా ఉంటుంది. కానీ.. హరీష్ మాత్రం `వకీల్ సాబ్` అవ్వగానే తనకు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడట. ఇటీవల పవన్ ని కలిసి స్క్రిప్ట్ మొత్తం చదివి వినిపించినట్టు, పవన్ ఫిదా అయిపోయినట్టు టాక్. కానీ.. `వకీల్ సాబ్` అవ్వగానే నీతోనే సినిమా చేస్తా అని పవన్ మాత్రం హరీష్‌కి మాట ఇవ్వలేదట. పవన్ తో ఆ మాట అనిపించుకోవాలని, వీలైనంత త్వరగా ఈ సినిమాని మొదలెట్టేయాలని చూస్తున్నాడు హరీష్. మరి ఏం జరుగుతుందో చూడాలి.