కొత్త సినిమాలకు వివాదాలు ఓ ట్రెండింగ్ పబ్లిసిటీగా మారాయి ఇప్పుడు. తాజాగా అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా 'డీజె - దువ్వాడ జగన్నాధమ్'కు వివాదాలు తప్పలేదు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆడియో సింగిల్ 'గుడిలో బడిలో..' సాంగ్ సంగీత ప్రియులను, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తూండగా, మరో పక్క ఈ పాట లిరిక్‌లోని పదాలు బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ వివాదం మొదలైంది. ఎంతో పవిత్రమైన మంత్రోఛ్ఛారణ పదాలను ఈ శృంగార పాట కోసం ఉపయోగించడం పట్ల బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దాంతో ఈ వివాదం ముదిరి పాకాన పడక ముందే సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు. ఓ వైదిక బ్రాహ్మణుడిగా తాను ఈ పాటలో ఏ విధమైన తప్పు పదాలు లేవని వారించారు. లిరిక్ రైటర్‌తో సహా మీడియా ముందుకు వచ్చి, ఈ పాటలోని ప్రతీ పదానికి అర్ధం వివరిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన షూటింగ్‌లో ఉన్న కారణంగా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేననీ, ఈ సినిమాను ఖచ్చితంగా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ఆయన తెలిపారు. తమ సినిమాలో బ్రాహ్మణ యువకుడు హీరో. అంటే బ్రాహ్మణుడు తలచుకుంటే యజ్ఞమూ చేయగలడు, యుద్ధమూ చేయగలడు అంటూ బ్రాహ్మణ కులాన్ని ఎంతో గొప్పగా చూపించామనీ ఆయన తెలిపారు. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌నందించారు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.