‘‘ఊహకు నేను విడాకులు ఇస్తున్నట్లు పలు వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం జరుగుతోంది. కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన ఫేక్ న్యూస్ చూసి ఊహ ఆందోళనకు గురైంది. నాపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా'' అని హెచ్చరించారు హీరో శ్రీకాంత్. తన భార్య ఊహకు విడాకులు ఇస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
"ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను...!? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది.
ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు ...ఆందోళన పడవద్దు ... అని తనను ఓదార్చాను . బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుంది నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి'' పేర్కొన్నారు శ్రీకాంత్.