కన్నడ నటుడు ఉపేంద్ర ఓ పొలిటికల్ మూవీని తెరకెక్కించే యోచనలో ఉన్నాడట. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నాడట ఉపేంద్ర. ఇటీవల ఉపేంద్ర ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ నుండి ఆయనంతట ఆయనే బయటికి వచ్చేశాడు. ఎందుకంటే, రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా ప్రజలకు మంచి చేయాలని యోచించిన ఉపేంద్రకు, పార్టీలోని అంతర్గత రాజకీయాలు చాలా బాధపెట్టాయట. దాంతో ప్రజలకు మంచి చేయాలనే ఆయన లక్ష్యం రాజకీయాల ద్వారా కుదిరేలా లేదని ఉపేంద్ర తెలుసుకున్నాడట.
ఈ నేపథ్యంలోనే ప్రజలకు సినిమా ద్వారా మంచి పొలిటికల్ సందేశం ఇవ్వాలనుకుంటున్నాడట ఉపేంద్ర. పలు డబ్బింగ్ సినిమాలతో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. కేవలం నటుడు మాత్రమే కాదు. మల్టీ టాలెంటెడ్ ఈయన. గతంలో 'కన్యాదానం' సినిమా ద్వారా స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించాడు. తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తాజా సినిమాతో మరోసారి తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు నటుడిగా దగ్గర కావాలనుకుంటున్నాడు ఉపేంద్ర. ఈ సినిమాని తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకుంటున్నాడట.
చూడాలి మరి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉపేంద్ర తపన ఈ సినిమా ద్వారా నెరవేరుతుందో లేదో! ప్రస్తుతం పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపేంద్ర పొలిటికల్ మూవీ ప్రజలపైనా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైనా ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి మరి.