రుద్రమదేవి తరవాత... గుణ శేఖర్ ప్రకటించిన మరో భారీ ప్రాజెక్ట్.. హిరణ్య కశ్యప. దాదాపు 200కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. గుణశేఖర్, సురేష్ బాబు సంయుక్తంగా ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ హోస్ తో చేతులు కలిపి నిర్మించే చిత్రమిది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో మొదలైపోయాయి. కానీ.. రానా డేట్లు మాత్రం దొరకడం లేదు. రానా చేతిలో సినిమాలు పూర్తయితే గానీ, హిరణ్య కశ్యప మొదలెట్టలేరు. రానా కూడా.. ఈ ప్రాజెక్టు చేయాలా? వద్దా? అనే విషయంలో సందేహంలో ఉన్నట్టు టాక్.
దాంతో... ఈ ప్రాజెక్టు చేతులు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. రానా కు బదులుగా అల్లు అర్జున్ తో ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుందా? అని గుణ శేఖర్ ఆలోచిస్తున్నాడట. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలని గుణశేఖర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. `రుద్రమదేవి`లో గోన గన్నారెడ్డిగా నటించాడు బన్నీ. ఆ తరవాత... బన్నీ కోసం ఓ కథ తయారు చేసుకునే పనిలో పడ్డాడు. తప్పకుండా వీరి కాంబోలో సినిమా వస్తుంది. అది.. హిరణ్య కశ్యప అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడు గుణశేఖర్. అయితే ఇది ప్రతిపాదన మాత్రమే. బన్నీకి ఇంత వరకూ ఈ విషయం తెలీదు. గుణశేఖర్ త్వరలోనే బన్నీని కలుస్తాడని, తన మనసులోని ఆలోచన చెబుతాడని ప్రచారం జరుగుతోంది. మరి ఏమవుతుందో చూడాలి.