లాక్ డౌన్ వల్ల ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. కరోనాతో వచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీని వల్ల మనం కోల్పోయిందేమిటి? అంటూ ఓ లిస్టు వేస్తే.. అది చాంతాడంత అవుతుంది. అయితే కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల తనకు లాభమే జరిగిందని, కోల్పోయింది ఏమీ లేదని చెబుతోంది ఇలియానా. ''నేను ఈమధ్య నా వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాను. ఇతరులపై ఆధారపడకుండా నా పని నేనే చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అందుకే.. లాక్ డౌన్ లో నాకేం తేడా కనిపించలేదు. పైగా ఎంతో కొంత మేలే చేసింది. ఇది వరకు వంట చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించేదాన్ని కాదు. కానీ.. ఈమధ్య వంటంతా నేనే చేస్తున్నా.
కొత్త కొత్త రెసిపీలు ట్రై చేస్తున్నా. నా ప్రయత్నాలన్నీ నా మనసుకు సంతృప్తి నిస్తున్నాయి. కథలు వినడంలోనూ కొత్త పద్ధతులు వచ్చాయి. ఆన్ లైన్, లైవ్‌లో.. కథలు వింటున్నా. అయితే మా అమ్మానాన్నలకు మాత్రం దూరమయ్యాను. అదే నా బాధ. వాళ్లంతా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. భగవంతుడి దయ వల్ల క్షేమంగా ఉన్నారు. అదే పది వేలు..'' అని చెప్పుకొచ్చింది.