అన్‌స్టాపబుల్ షో... సూపర్ డూపర్ హిట్. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ షోలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్. వివాదాలు నిల్. కాకపోతే.. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మాత్రం రాజకీయాలకు కేరాఫ్‌గా మారింది. ఈ షో ద్వారా... పవన్‌ని రాజకీయంగా వాడుకోవాలనుకంటున్నారా? అనే అనుమానాలు పవన్ ఫ్యాన్స్ వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే పవన్ ఎపిసోడ్ లో ఎక్కువగా పొలిటికల్ ప్రశ్నలే వచ్చాయి. పార్టీ ఎందుకు పెట్టారు? అప్పట్లో టీడీపీలోనే ఎందుకు కలవలేదు? అనే ప్రశ్నలు బాలయ్య వేయడం, దానికి పవన్ ఆన్సర్ చెప్పడం.. అభిమానుల్లో, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీ, జనసేన ఒక్కటే అని చెప్పడానికి ఈ షోనే ఉదాహరణగా చూపిస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. మూడు పెళ్లిళ్ల విషయాన్ని ఎత్తిన బాలయ్య.. ఇకపై ఆ టాపిక్ తీసుకొచ్చిన వాళ్లు అడ్డగాడిదలు అనేశాడు.
ఈ ఎపిసోడ్ ద్వారా ఒక విషయం స్పష్టమైంది. పవన్‌కి రాజకీయంగా టీడీపీ అండగా ఉండబోతోందన్న సంకేతాలు బాలయ్య మాటల ద్వారా బయటకు వచ్చేశాయి. పవన్‌లోని నిజాయతీ, ఆత్మస్థైర్యం, ప్రజల పట్ల, సేవ పట్ల తనకున్న దృక్పథాన్ని ఎలివేట్ చేయడానికి ఈ షో ఉపయోగపడింది. అన్నింటికంటే అభిమానుల్ని బాగా ఆకట్టుకొన్న విషయం.. పవన్‌ని బాలయ్య 'భయ్యా.. భయ్యా' అంటూ పిలవడం. వీరిద్దర్నీ వెండి తెరపై ఎలాగూ చూడలేం. కనీసం ఓటీటీ తెరపై నైనా జాయింటుగా చూశామన్న సంతృప్తి అభిమానులకు కలిగింది.