అదేంటో....? త్రివిక్రమ్ ఏ సినిమా తీసినా దానిపై కాపీ ముద్ర పడుతుంటుంది. ఆయన సాహితీ ప్రేమికుడు. తను చదివినన్ని పుస్తకాలు బహుశా.. మరే దర్శకుడూ చదవలేదేమో..? ఆ ప్రభావం తనపై, తన సినిమాలపై చాలా ఉంది. ముఖ్యంగా యద్దనపూడి సులోచనా రాణికి ఆయన వీరాభిమాని. త్రివిక్రమ్ యద్దనపూడి స్టైల్ కనిపిస్తుంటుంది. 'మన్మథుడు'కి 'గిరిజా కల్యాణం' అనే సినిమా ప్రేరణ. 'అ.ఆ' కథని 'మీనా' అనే నవల నుంచి తీసుకొన్నారు. ఇప్పుడు గుంటూరు కారం కూడా యద్దనపూడి సులోచనా రాణి నవల నుంచి స్ఫూర్తి పొందిందే అని టాక్. యద్దనపూడి రాసిన కీర్తి కిరీటాలు నవల్ని సినిమా సూత్రాలకు అనుగుణంగా మార్చి ఈ కథని రాసినట్టు తెలుస్తోంది.
హీరో క్యారెక్టరైజేషన్, సవతి తల్లి ఎపిసోడ్, మరదలి పాత్ర... ఇవన్నీ 'కీర్తి కిరీటాలు' నుంచి ప్రేరణ పొందినదే అని సమాచారం. మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 12న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. ట్రైలర్ జాగ్రత్తగా గమనిస్తే.. 'కీర్తి కిరీటాలు' ఛాయలు కనిపిస్తాయి.అయితే... ఈ విషయాన్ని చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు. బహుశా.. టైటిల్ కార్డులో క్రెడిట్ ఇస్తారేమో చూడాలి. 'అ.ఆ' మూలకథ 'మీనా' నవల నుంచి తీసుకొన్నా టైటిల్ కార్డులో ఆ ప్రస్తావన తీసుకురాలేదు. మరి త్రివిక్రమ్ ఈసారి ఏం చేస్తాడో తెలియాల్సివుంది.