ఏపీ ఎన్నికల ఫలితాలు పలువుర్ని ఆశ్చర్య చకితుల్ని చేసాయి. కూటమి విజయం సాధించింది. అదీ చరిత్రలో నిలిచిపోయే విజయం. మూకుమ్మడిగా పోరాడి శత్రువుని కోలుకోలేని దెబ్బ కొట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం ఒక విక్టరీ అని చెప్పాలి. పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసాడు. 2019 లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెందిన పవన్ ఈ సారి పిఠాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేసి 70,354 ఓట్ల ఆధిక్యంతో భారీ మెజారిటీతో విజయం సాధించారు. తనని విమర్శించిన వారికి తన విజయం తో సమాధానం చెప్పారు. జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా, 21 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. పవన్ విక్టరీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
2019 ఎన్నికలకి, 24 ఎన్నికలకి పవన్ కళ్యాణ్ లో ఎంత మార్పు వచ్చింది. రాజకీయ పరిణితి వచ్చింది. మనిషి రాటు దేలాడు. ప్రత్యర్థి ఎంత రెచ్చ గొట్టినా కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. అతని బలహీనత శత్రువు బలం కాకూడదని నిగ్రహంతో మెలిగాడు. తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దిగజారుడు రాజకీయాలు చేసినా, పవన్ మాత్రం వ్యక్తిగత దూషణలు చేయలేదు. హలో ఏపీ ......బై బై వైసీపీ అన్న స్లోగన్ జనాల్లోకి బాగా తీసుకువెళ్లారు. వారాహి యాత్రతో ప్రతి ఒక్కరికి చేరువ అయ్యాడు. కనీసం ఒక్క సీట్ లేకుండా, పార్టీ అధినేత కూడా గెలవని పరిస్థితిలో ఉండి ఐదేళ్లపాటు పార్టీని నడిపించారు. ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా ఉన్నారు. అధికార పార్టీ చేసిన అక్రమాలను , దౌర్జన్యాలను, ఆధారాలతో సహా తీసుకు వెళ్లి ప్రజలు ముందు ఉంచారు. తుది నిర్ణయం మీదే అని ఛాయిస్ వారికే వదిలేశారు. ప్రజావాణి పేరుతో వారి గోడు విని నేనున్నా అన్న భరోసా అందించారు. వైసీపీని ఓడించటం లో పవన్ కీలక పాత్ర పోషించారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.
అవకాశం వచ్చినా తాను ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడకుండా శత్రువుని సమిష్టిగా ఓడించేందుకు కూటమితో చేయి కలిపారు. చంద్ర బాబు అరెస్ట్ ని రాజకీయం చేసి తనకి అనుకూలంగా మార్చుకోలేదు. కష్టంలో ఉన్నబాబుకి అండగా నిలిచి కొన్ని కోట్ల మంది హృదయాలు గెల్చుకున్నారు. సినిమా ప్రపంచం లో మకుటం లేని మహారాజుగా పేరుగాంచినా ప్రజలకోసం ఏదైనా చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చి కల నెరవేర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం పలువురికి ఆదర్శనీయం.