శ్రీనివాస క్రియేషన్స్ సంస్థపై దాడి చేసిన వెస్ట్‌జోన్ పోలీసులు దొంగ నోట్లను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్, రవి అనే ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో శ్రీనివాస్ అనే వ్యక్తి నటి జీవిత తమ్ముడు అంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై నటి జీవిత స్పందించారు. ఎలక్ట్రానిక్ మీడియాతో ఆమె మాట్లాడారు.
జీవిత మాట్లాడుతూ - ``నాకు తెలిసి ఏమీ జరగలేదు. నాకు ఏమీ తెలియదు. మీడియా నుండి న్యూస్ వచ్చే వరకు మాకు న్యూస్ కూడా లేదు. అసలు మీడియా చెబుతున్న ప్లేస్‌లో శ్రీనివాస్ క్రియేషన్స్ కాదు జోస్టార్ పేరుతో నా ఆఫీస్ ఉంది. ఈ బ్యానర్‌లో పిఎస్‌వి గరుడవేగ అనే సినిమా జరుగుతుంది. అలాగే మా కంపెనీ తరపున పనిచేసే నలుగురు మేనేజర్స్‌లో శ్రీనివాస్ ఒకరు. మిగిలిన ముగ్గురు మేనేజర్స్ పేరు సాయిరాం, వెంకట్, బాలగోపాల్. అసలు శ్రీనివాస్‌కు ఏమైందనే విషయం అతన్నే అడగాలే తప్ప, అతను మా వద్ద పనిచేస్తున్నాడనే కారణంతో వెంటనే జీవిత రాజశేఖర్ కార్యాలయంలో డబ్బులు దొరికాయని అంటున్నారు. మా ఇల్లు పక్కనే ఉంది. మాకు తెలియకుండా ఏమీ జరగదు. శ్రీనివాస్ అనే అతను నా బ్రదర్ అని, అతను అరెస్ట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. నా అసలు తమ్ముడు మురళి శ్రీనివాస్ కిడ్నీ ఆపరేషన్ జరిగి ఆపోలో హాస్పిటల్‌లో ఉన్నాడు. నా దగ్గర ఒక శ్రీనివాస్ పనిచేయలేదు. నా సినిమా డబ్బింగ్, ఎడిటింగ్ వర్క్ అంతా అన్నపూర్ణలో జరుగుతుంది. అందరూ జోస్టార్ సినిమాకు, పిఎస్‌వి గరుడవేగకు పనిచేస్తున్నట్లే. నా దగ్గర పనిచేస్తే నాకు సంబంధం ఉంటుందా, ఈ ఆఫీస్ నాది. అసలు శ్రీనివాస క్రియేషన్స్ ఎక్కడి నుండి వచ్చింది. ఫిలించాంబర్‌లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. నా కుటుంబం క్షేమంగా ఉంది. నాకు ఏ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేయలేదు. నాకు ఏ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ రాలేదు. ఇది మీడియా నుండే పుట్టిన వార్త`` అన్నారు.
- ప్రెస్ రిలీజ్