2016లో 'జనతా గ్యారేజ్' సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2017లో 'జై లవకుశ' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇంతవరకూ యంగ్ స్టార్స్‌లో ఎవరూ చేయని ట్రిపుల్ రోల్‌లో నటించి సత్తా చాటాడు ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్. తొలిసారిగా అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ నటించిన సినిమా 'జై లవకుశ'.
అయితే ఈ సినిమా సంగతి పక్కన పెడితే, ఇదే టైంలో ఎన్టీఆర్ చేసిన బుల్లితెర మెగా గేమ్ షో 'బిగ్‌బాస్' ఎన్టీఆర్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇంటి ఇంటికీ ఎన్టీఆర్‌ని దగ్గర చేసింది. ఏకంగా 72 రోజులు ఈ గేమ్ షో ద్వారా ఎన్టీఆర్ ఆడియన్స్‌కి పంచిన ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఇంతా కాదు. నిజానికి వారంలో రెండు రోజులు మాత్రమే ఎన్టీఆర్ ఈ షోలో కనిపించేవాడు. కానీ వారమంతా ఆ ఇంపాక్ట్ ఉండేది ప్రేక్షకుల్లో. అలా ఈ షోతో బుల్లితెర బిగ్‌బాస్ అయిపోయాడు ఎన్టీఆర్. ఆడించాడు, నవ్వించాడు, కవ్వించాడు, వంటలు చేసి కొత్త కొత్తగా ఆలరించాడు. అబ్బో ఒక్కటేమిటి 'బిగ్‌బాస్' షోతో ఎన్టీఆర్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ అయిపోయాక ఆ షోని మర్చిపోలేక ఆడియన్స్ చాలా ఫీల్ అయ్యారు కూడా. అంతగా ఈ షో ద్వారా ఎన్టీఆర్ పాపులర్ అయిపోయాడు.
ఇకపోతే సినిమా 'జై లవకుశ' విషయానికి వస్తే, ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్. మూడు పాత్రలూ ఒకదానికొకటి భిన్నమైనవే. అయితే ఆ మూడింట్లోనూ 'జై' పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిన్న పిల్లాడి దగ్గర్నుంచీ, అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. 'జై' పాత్రతో ఎన్టీఆర్ ట్రై చేసిన న్యూ అటెంప్ట్ అందర్నీ మెప్పించింది. అలా 2017లో ఎన్టీఆర్ ఓ పక్క 'బిగ్‌బాస్' షోతోనూ, మరో పక్క 'జై లవకుశ' సినిమాతోనూ డిఫరెంట్‌గా సత్తా చాటాడు.