జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేయనున్నాడన్న వార్త బయటికి రాగానే అందరి దృష్టి ఆ విషయం పైనే. తాజాగా బుల్లితెరపై జూనియర్ ఎంట్రీకి సంబంధించి ఓ లుక్ కూడా రిలీజ్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బుల్లితెర సిరీస్ 'బిగ్‌బాస్' బాలీవుడ్‌లోనే కాదు, అంతటా ఓ సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు ఈ సెన్సేషన్ తెలుగులోనూ మొదలు కానుంది. 'బిగ్‌బాస్' పేరుతోనే ఈ షో స్టార్ట్ కానుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అప్పుడే ఈ ఫోకి కావాల్సినంత పాపులారిటీ వచ్చేసింది. ఇదంతా ఎన్టీఆర్ లుక్‌తోనే. కొంటెగా ఎన్టీఆర్ చూస్తున్న చూపు, అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ షో ఖచ్చితంగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమంటున్నారు. ఈ ఒక్క లుక్‌తోనే ఎన్టీఆర్ షోకి కావాల్సినంత గ్లామర్ తెచ్చేశాడు. ఇంకా ఏముంది. ముందుందట అసలు సంగతి. రకరకాల ప్రోమోస్, అదరిపోయే స్టిల్స్ ఇంకా చాలా ఉన్నాయట. ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారట. ఇంతవరకూ బుల్లితెరపై 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాం ద్వారా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ గేమ్ షో సీజన్ కంప్లీట్ అయ్యేసరికి జూనియర్ ఎన్టీఆర్ సందడి మొదలు కానుంది. త్వరలోనే ఈ ప్రోగ్రాం షూటింగ్ స్టార్ట్ కానుంది. మరో పక్క ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమాతో బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.